Elon Musk : టెస్లా (Tesla), స్పేస్ఎక్స్ సీఈవో (SpaceX CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) తనపై వస్తున్న జాతి వివక్ష ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను జాత్యహంకారిని కాదని, తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ‘ది ఎకానమిస్ట్ (The Economist)’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మిమ్మల్ని జాత్యహంకారి అంటున్నారు కదా అని ఇంటర్వ్యూలో హోస్ట్ ప్రశ్నించగా.. మస్క్ తన వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తూ సమాధానమిచ్చారు.
‘నా జీవిత భాగస్వామి సగం భారతీయురాలు. ఆమెతో నాకు నలుగురు పిల్లలున్నారు. వారిలో ఒక కుమారుడికి ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్త పేరు పెట్టాను. అలాంటప్పుడు నేను జాత్యహంకారిని ఎలా అవుతాను..?’ అని మస్క్ ప్రశ్నించారు. మస్క్ భార్య శివోన్ జిలిస్ సగం భారతీయ మూలాలున్న కెనడియన్. వారి కుమారులలో ఒకరి పేరు మధ్యలో ‘శేఖర్స ఉంటుంది. నోబెల్ గ్రహీత, భారత-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ఈ పేరు పెట్టారు.
శివోన్ జిలిస్.. మస్క్ స్థాపించిన న్యూరాలింక్ కంపెనీలో 2017 నుంచి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా తన కంపెనీలలో అన్ని జాతులకు చెందిన వారు ఉన్నత పదవుల్లో ఉన్నారని, అక్కడ ఎలాంటి జాత్యహంకారానికి తావులేదని చెప్పారు. విచిత్రం ఏమిటంటే జాతి వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న మస్క్.. స్వయంగా ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ను ‘శ్వేతజాతి వ్యతిరేక జాత్యహంకారి’ అని నిందించడం సంచలనం రేపుతోంది. ఇటీవల విడుదలైన నోలన్ తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ మూవీలో నటీనటుల ఎంపిక ఈ వివాదానికి కారణమైంది.
ప్రఖ్యాత గ్రీకు ఇతిహాసం ‘ది ఒడిస్సీ’ లోని హెలెన్ ఆఫ్ ట్రాయ్ పాత్రకు నల్లజాతికి చెందిన ఆస్కార్ విజేత నటి లుపిటా యోంగోను ఎంపిక చేయడాన్ని మస్క్ తీవ్రంగా తప్పుబట్టారు. హోమర్ తన రచనలో హెలెన్ పాత్రను ‘లేత చర్మం’, ‘బంగారు జుట్టు’ కలిగిన యువతిగా వర్ణించాడని, దానికి విరుద్ధంగా నల్లజాతి నటిని ఎంపిక చేసి నోలన్ తన సమగ్రతను కోల్పోయారని, హోమర్ సమాధిపై అగౌరవం చూపారని మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ లో ఆరోపించారు.