న్యూఢిల్లీ: భారతీయ మహిళ కెనడా(Canada)లో దారుణ హత్యకు గురైంది. 23 ఏళ్ల దమన్‌ప్రీత్ కౌర్‌ను.. ఆమె భాగస్వామి హత్య చేశాడు. ఎడ్మంటన్‌లోని ఓ ఇంట్లో ఆమెను గొంతునులిమి చంపేశాడు. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు. జూలై 9వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ కేసులో 22 ఏళ్ల రితీశ్ కుమార్‌ను ఎడ్మంటన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్ట్‌నర్‌పై సెకండ్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. బాధితురాలు దమన్‌ప్రీత్ కౌర్‌ది.. పంజాబ్‌లోని లుథియానా జిల్లా.
జూలై 9వ తేదీన సాయంత్రం గాయపడ్డ ఓ మహిళ తమకు కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద గాయాలు ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. జూలై 12వ తేదీన ఆమె ప్రాణాలు కోల్పోయింది. అటాప్సీ నివేదిక ఆధారంగా ఆ మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు తేల్చారు. గొంతు నొక్కడం వల్ల దమన్‌ప్రీత్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 22వ తేదీన రితీశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. రహస్య భాగస్వామిని హత్య చేసినట్లు తేల్చారు. అయితే కౌర్ భౌతికదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు.