ప్రజలు క్లారిటీతో ఉన్నరు…
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం, ఏహ్యభావం ఏర్పడింది. నమ్మి మోసపోయినమని జనం కోపంలో ఉన్నరు. సకదనంగ నడిసే బీఆర్ఎస్ ప్రభు త్వాన్ని పోగొట్టుకున్నామని బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చినయ్. వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీతో ఉన్నది.
లక్షల జీవితాలు ఆగమైనయ్…
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రియల్ ఎస్టేట్‌లో తెలంగాణ రాష్ట్రం ముంబై, ఢిల్లీలతో పోటీ పడే పరిస్థితి ఉండేది. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ పాలకులు మొత్తానికే కుప్ప కూల్చిండ్రు. ఆ రంగంలో పనిచేసే లక్షలాది మంది జీవితాలను ఆగం చేసిండ్రు.
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

గోపీనాథ్ ప్రజల హృదయాలను గెలిచిండు
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఆ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేయాలి. ఆయన నిత్యం జనసామాన్యంలో ఉంటూ, పేదలను ఆపదలో ఆదుకుంటూ ప్రజల హృదయాలను గెలిచారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలి. సునీతను భారీ మెజార్టీతో గెలిపించుకోని గులాబీ జెండా మళ్లీ
– బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడుతున్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు గల్లా పట్టి నిలదీయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీతాగోపీనాథ్ గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని పేర్కొన్నారు. పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్టపాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాలని పునరుద్ఘాటించారు. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవడం అంటే తెలంగాణ భవిష్యత్తుకు, పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమేనని, ప్రతి ఒక నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా సంపూర్ణంగా మనసు పెట్టి పనిచేయాలని ఆదేశించారు.
నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల అయిందని అన్నారు. ఇక జూబ్లీహిల్స్‌లో తన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటర్‌ను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తంచేశారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని, హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీతాగోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యంగా, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో గురువారం దాదాపు మూడుగంటలపాటు సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలుపు దిశగా ఇప్పటికే ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇన్చార్జులు నివేదించారు. అనంతరం పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ భారీ మెజారిటీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించిన అంశాలపై అధినేత కేసీఆర్ సమీక్షించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ 22 నెలల పాలనలో తెలంగాణ దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితుల గురించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనాకాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేసిన సంక్షేమ పథకాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని చెప్పారు. పేద గర్భిణులకు మానవీయ కోణంలో అందించిన కేసీఆర్ కిట్ పథకాన్ని ఎందుకు ఆపేశారో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. యాదవులకు అందిస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారో, చేపల పంపిణీని ఎందుకు దిగమింగారో, ఓటు అడగడానికి ఇంటి ముందుకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని, ఆ పార్టీ నేతలను నిలదీయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పట్ల తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసహ్యం, ఏహ్యభావం ఏర్పడిందని కేసీఆర్ చెప్పారు. ‘నమ్మి గుంతల బడ్డం మోసపోయినమని కోపంలో ఉన్నరు. సకదనంగ నడిసే బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొట్టుకున్నామనే బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చినయి. వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీతో ఉన్నది. ఎలక్షన్స్ వచ్చాయని కాదు.. కాంగ్రెస్ చేసిన మోసం పట్ల రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నరు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపును ఇప్పటికే ప్రజలు ఖాయం చేసిండ్రు. ఇక మీ పని భారీ మెజారిటీ సాధించేందుకు ప్రజలతో కలిసి పని చేయడమే. అందుకు డివిజన్లవారీగా, క్లస్టర్లవారీగా పార్టీ నేతలంతా వ్యూహంతో పనిచేయాలి. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ వారి హృదయాలను గెలవాలి’ అని కేసీఆర్ ఉద్భోదించారు.
కాంగ్రెస్ 22 నెలలపాలనలో రియల్ ఎస్టేట్సహా అన్ని రంగాలు కుప్పకూలిపోవడంతో ప్రజల చేతిలో పైసలు ఆడటం లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ పల్లెల్లో రైతులే కాదు, హైదరాబాద్‌లో ప్రజల చేతుల్లో పైసలు ఆడక పరేషాన్లో పడ్డారని తెలిపారు. ‘ఈ నడుమ నన్నొక పెద్దమనిషి (కూలి చేసుకొనే వృద్ధుడు) కలిస్తే అడిగిన.. నీకెందుకు పరేషాన్.. నీకేమీ పంటలు లేవు, వ్యాపారం లేదు గదా అని. నాకు పంటలు, వ్యాపారాలు లేవు కానీ, కూలి కూడా దొరకడం లేదు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రియల్ఎస్టేట్ ఏంది.. ప్రతి ఒక వ్యాపారం బ్రహ్మాండంగా నడిచింది.
అప్పుడు కూలి నాలి దొరికింది. అందరి చేతుల్లో పైసలుంటుండే. ఇప్పుడు అంతా దివాలా తీసినట్టు అయింది.. కారోబార్ కరువైంది. ఇప్పుడు మళ్లా రాష్ట్రాన్ని బాగుచేయాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీతో తప్ప ఎవరితో సాధ్యం కాదు’ అని ఆ వృద్ధుడు తెలిపారని గుర్తుచేశారు. ‘రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండటం అంటే.. అన్ని రంగాలు అభివృద్ధి దిశగా పయనించడమే. కానీ ఏ ఒక రంగమూ సరిగ్గా లేదు. పదేండ్లపాటు పస్తులుండి పైసా పైసా కూడబెడితే రెండేండ్లు కూడా కాలేదు. ఎకణ్ణించి వచ్చిందో ఈ దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ వచ్చి మొత్తానికి మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం పట్టించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రెసిడెన్షియల్ సూళ్లను స్థాపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించి వారిని ఐఏఎస్‌లు, ఐపీఎస్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను సాధించేలా తీర్చిదిద్దామని చెప్పారు. తన ఆలోచనలను అమలుచేసినందుకు ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కేసీఆర్ అభినందించారు. తాను అత్యున్నత స్థాయి విద్యను, హాస్టల్ సౌకర్యాలను గురుకులాలకు అందిస్తే, ప్రస్తుత ప్రభుత్వ చేతగానితనంతో పిల్లలు మరణించడం దారుణం, శోచనీయమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసింది దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు. కరోనాతోపాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సంగతిని ప్రజలు మరిచిపోలేదని గుర్తుచేశారు. కష్టకాలంలో నిలబెట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అన్ని డివిజన్లలో, క్లస్టర్లలో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, చివరి నిమిషం వరకు ప్రతి ఓటు పోలయ్యేలా చూడాలని కేసీఆర్ పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు. ‘ప్రజలకు అర్థమయ్యే తీరుగా వారి భాషలో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రచారం సాగాలి. జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీషీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నరు. ఈ విషయాన్ని ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాం గ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే గనక జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అకడి ప్రజలు ఆలోచన చేయాలి. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు రేపు గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం.. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే ఉంటదా? అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి’ అని కేసీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రియల్ ఎస్టేట్‌లో తెలంగాణ రాష్ట్రం ముంబై, ఢిల్లీలతో పోటీ పడే పరిస్థితి ఉండేదని కేసీఆర్ గుర్తుచేశారు. ‘హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తానికే కుప్ప కూల్చిండ్రు. ఆ రంగంలో పనిచేసే లక్షలాది మంది జీవితాలను ఆగం చేసిండ్రు. ఇదే విషయం మీద కోపంతో ఉన్న ప్రజలకు.. అండగా నిలుస్తామని మీరు భరోసాను కల్పించాలి’ అని కేసీఆర్ సూచించారు. ‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి గంటలు గంటలు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించే వాళ్లం. ఆయా శాఖల్లో ఆదాయాన్ని ఎలా పెంచవచ్చో ఆలోచనలు చేసే వాళ్లం. అన్ని రంగాల మీద ప్రత్యేక దృష్టి సారించడం వల్లనే తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటులో దేశంలో నంబర్‌వన్‌గా నిలిచింది. బీఆర్ఎస్ హయాంలో ఏ పథకం అమలు చేసినా, మానవీయ కోణంలో, మనసు పెట్టి అమలు చేశాం’ అని కేసీఆర్ గుర్తుచేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుండటం అంటే అన్ని రంగాలు అభివృద్ధి దిశగా పయనించడమే. కానీ ఏ ఒక రంగమూ సరిగ్గా లేదు. పదేండ్లపాటు పస్తులుండి పైసా పైసా కూడబెడితే రెండేండ్లు కూడా కాలేదు. ఎకణ్ణించి వచ్చిందో ఈ దుర్మార్గ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం పట్టించింది.
-కేసీఆర్
కుటుంబానికైనా, రాష్ట్రానికైనా అతార (వస్తువులు/వసతులు) ఉంటేనే పతేరా (డిమాండ్) పెరుగుతుందని కేసీఆర్ గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, విద్యుత్తు ఇతర అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టామని చెప్పారు. తెలంగాణ ప్రాంతం వెనుకబడిందని కొం దరు ప్రచారం చేశారు. అలాంటి తెలంగాణను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆర్థికంగా బలోపేతం చేశాం. దేశం మనవైపు చూసేలా, పెట్టుబడులు రాబట్టి ప్రగతిని సాధించడానికి అనేక రకాల వ్యూహాలను, ఎత్తుగడలను అమలుచేసి రాష్ట్ర ఆర్థిక రంగాన్ని బలోపేతం చేశాం. పైసా పైసా కూడబెట్టి ప్రగతిని సాధిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వల్ల ప్రతి ఏటా 10-15 శాతం పెరగాల్సిన ఆదాయం మైనస్‌లోకి వెళ్లిపోతున్నది. పదేండ్లపాటు నడిసిన అన్ని రంగాలు రెండేండ్లలోనే సర్వనాశనం అయిపోవడం బాధాకరం. ఈనగాచి నకల పాలు జేసినట్టు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలో ఆర్థికవృద్ధిలో తెలంగాణ చివరి స్థానంలో ఉన్నట్లు రిపోర్టులు వస్తుంటే కండ్లళ్ల నీళ్లు వస్తున్నయి. ప్రజల పకలోకి బల్లెంలాగా ఏడికెళ్లి ్లవచ్చిందో ఈ దుర్మార్గపు పాలన, ఓట్లు అడగడానికి మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ప్రశాంతంగా ఉన్న ప్రజలు వాళ్ల పకలకు మళ్లా కాంగ్రెస్ అనే బల్లాన్ని తెచ్చుకుంటరా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు.
హైడ్రా పేరుతో బుల్డోజర్లను తమ గుడిసెల మీదికి, ఇండ్ల మీదికి తోలి కూలగొడుతున్న కాంగ్రెస్ నాయకులను, తమకు నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వచ్చినప్పుడు ఓటర్లు గల్లా పట్టి నిలదీయాలి.
-కేసీఆర్
జూబ్లీహిల్స్ ప్రజలకు బీజేపీ గురించిన ఆలోచనేలేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘బీజేపీ గురించి అడిగితే అదెకడుంది అని ప్రజలే ఉల్టా అడుగుతున్నరు. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నరు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవడం అంటే తెలంగాణ భవిష్యత్తుకు, పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే. కాబట్టి ప్రతీ ఒక నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా, సంపూర్ణంగా మనసు పెట్టి పనిచేయాలి’ అని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్తోపాటు ఉపఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల, క్లస్టర్ల ఇన్‌చార్జులైన మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నేతలు, స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తదితర పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఆ నియోజకవర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేయాలని కేసీఆర్ సూచించారు. గోపీనాథ్ నిత్యం ప్రజల్లో ఉంటూ, పేదలను ఆపదలో ఆదుకున్నారని గుర్తుచేశారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని సూచించారు. రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజావ్యతిరేకంగా మారిందని, ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారుచేసుకొని ప్రతి ఇంటికీ వెళ్లి విడమర్చి చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను గడపగడపకు తీసుకెళ్లి కాంగ్రెస్ 420 హామీలపై ప్రజలను చైతన్యపర్చాలని సూచించారు. నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందని, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.