హైదరాబాద్ : రైతుల రుణమాఫీపై రేవంత్ సర్కార్‌ను బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. ఏ ఆగస్టు 15కు మాఫీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.
డిసెంబర్ 9న పదిన్నర గంటలకు రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. చాలా బాధాకరం అనిపిస్తుంది.. సీఎం మాట్లాడాల్సిన మాట కాదు అది. ఆయన ధైర్యమా.. అర్భకత్వామా.. తెలివి తక్కువతనమా అనేది అర్థం అయితలేదు. ఒక సంవత్సరం దోపిడీని ఆపేస్తే రూ. 40 వేల కోట్లు రుణమాఫీని ఎడమ చేతితో మాఫీ చేస్తాను అంటుండు రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో చూశాను. ఒక వ్యక్తి మూర్ఖత్వానికి అవధులు ఉంటాయి. మీడియా ముందు ఒళ్లు మరిచి మాట్లాడకూడదు. ఇది సోషల్ మీడియా యుగం. జాగ్రత్తగా మాట్లాడాలని కేసీఆర్ హెచ్చరించారు.
ఏ ఊరుకు పోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం అలవాటు అయిపోయింది. రైతు రుణమాఫీకి డిసెంబర్ 9 పోయింది. ఇప్పుడు ఆగస్టు 15 అని అంటుడు. మరి తెలివిగా ఏ ఆగస్టు 15 చెప్పడం లేదు. అర్థమైతలేదు. వచ్చే ఏడాది ఆగస్టు అంటే అప్పుడు ఏం చేయాలి. బస్సు యాత్ర చేస్తున్నప్పుడు మధ్యాహ్నం సమయంలో చాలా మంది రైతులు కలిశారు. రైతుల అడ్వాన్స్‌గా అనుమానం వ్యక్తం చేశారు. ఏ ఆగస్టు అని అడిగారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
వ్యవసాయా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావడమే మాకు శాపంగా మారిందని రైతులు భావించారు. రైతు భరోసా, రుణమాఫీ లేదు. ఒట్లు పెట్టుకోవడం పెద్ద జోక్ అయిపోయింది. కేసీఆర్ మీద తిట్లు దేవుళ్ల మీద ఒట్లు తప్ప ఏం లేదు. పంటలు ఎండిపోయాయి. అక్కడక్కడ పండిన ధాన్యాన్ని కూడా కొంటలేరు. చెరువులు, చెక్ డ్యామ్‌లు నింపలేదు. బోర్లు వేసి లక్షల రూపాయాలు వేస్ట్ చేసుకున్నారు రైతులు. భూగర్భ జలాలు పడిపోయాయి. సాగు నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయాయి. చెరువుల్లో నీళ్లు లేక చేపలు చనిపోయాయి. ఇదంతా షార్ట్ పీరియడ్‌లో జరిగిపోయింది. చేపలు పట్టుకోవడం ఇబ్బందిగా మారింది నీళ్లు వదలాలని గతంలో మమ్మల్ని అడిగారు. ఇప్పుడేమో నీళ్లు లేక చేపలు చనిపోయాయని కేసీఆర్ తెలిపారు.
ధాన్యానికి క్వింటాల్‌కు బోనస్ 500 ఇస్తామన్నారు. బోనస్ మాటనే లేదు. బోనస్ బోగస్ అయింది. రైతులు ఆగ్రహం మీద ఉన్నారు. బోనస్ పక్కన పెడితే మద్దతు ధర ఇప్పించమని రైతులు అడుగుతున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాబోతోంది. వాళ్ల దుష్ప్రపరిపాలన వారికి శాపంగా మారుతుందన్నారు కేసీఆర్.
రైతుబంధు విషయంలో రైతులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏదైనా పథకం అమలు చేస్తే దాని గురించి ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలి. రైతుబంధు విధానం మారుస్తామని, సాగు చేసినోడికే రైతుబంధు వేస్తామంటున్నారు. రైతుబంధు ఇవ్వకుండా ఎగొట్టాలని చూస్తున్నారు. రైతుబంధు అమలు చేస్తే రూ. 22 వేల కోట్లు వేయాలి. దానికి భయపడి ఎగబెట్టాలని కుంటిసాకులు చెబుతున్నారు. శాటిలైట్ ద్వారా పరిశీలించి.. పంట సాగు చేసినోడికే ఇస్తామంటున్నారు. పంట వేసినట్లు మళ్లీ వ్యవసాయ అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వాలి.. మళ్లీ లావో అంటరు. రేపు రైతుబంధును పెయిల్యూర్ చేయాలని ప్రభుత్వం ఉన్నదని రైతులకు తెలిసిపోయింది. కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.