హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తేతెలంగాణ): సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజాపక్షం వహించారన్నారు. వారి సేవలను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఏచూరి మరణం కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటన్నారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీతారాం ఏచూరి మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. కమ్యూనిస్టు నాయకుడిగా ఏచూరి జీవితాంతం ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశారన్నారు. రాజకీయాల్లో ఏచూరి ఎంతో హుందాగా ఉండేవారని గుర్తుచేశారు. రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని తెలిపారు. సీపీఎంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏచూరి సృష్టించుకున్నారని పేర్కొన్నారు. ఈ కష్టసమయంలో ఏచూరి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశ రాజకీయాలకు
ఏచూరి మృతి పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని, ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని అన్నారు. రాజ్యసభ ఎంపీగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఆయన ఎంతో సేవ చేశారన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ప్రజా సమస్యలు, దేశ సమస్యలను ప్రస్తావన చేసే ఒక గొంతు మూగబోయిందన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏచూరి మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎంపీలు వినోద్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్, ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల ఓంకార్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.