హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొన్న నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఈసీ సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎన్ బర్ గురువారం అధికారికంగా లేఖ రాశారు. పార్టీ పేరు మార్పునకు సంబంధించిన మిగిలిన ప్రక్రియను చేపడుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అక్టోబర్ 5న రాసిన లేఖ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిపారు. ఈసీ లేఖ ప్రతులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల సంఘాల ముఖ్య ఎన్నికల అధికారులకు కూడా పంపింది.
నేడు ఆవిర్భావ సంబురాలు
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారిక ఆవిర్భావ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1:20 గంటలకు అధికారికంగా పార్టీ పేరు మార్పునకు సంబంధించిన పత్రాలపై సీఎం కేసీఆర్ సంతకం చేస్తారు. ఈసీ లేఖకు తొలుత ప్రత్యుత్తర లేఖ రాస్తారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీచైర్మన్లు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, రైతు బంధు సమితి అధ్యక్షులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల కోసం కే కేశవరావు, నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన ఎంపీలు గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది అధికారికంగా గుర్తింపు దక్కడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో గురువారం టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటం వద్ద ఆకులతో ఆంగ్ల అక్షర ఆకృతిలో ‘వెల్కమ్ బీఆర్ఎస్’ అని రాసి.. ‘జై కేసీఆర్.. దేశ్‌కీ నేత కేసీఆర్’ అంటూ నినదించారు. ఎంపీటీసీ గాడ్గె సుభాష్, సర్పంచ్ గాడ్గె మీనాక్షి మాట్లాడుతూ కాబోయే ప్రధాని కేసీఆర్ అని పేర్కొన్నారు. – ఇచ్చోడ
గుర్తు మారదు.. గులాబీ మారదు
బీఆర్ఎస్గా మారినప్పటికీ పార్టీ ఎన్నికల గుర్తు, జెండా రంగులో ఎలాంటి మార్పు ఉండవని పార్టీ వర్గాలు తెలిపాయి. కారు గుర్తుతోనే పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తుంది. పార్టీ రంగు కూడా గులాబీ రంగే ఉంటుందని వెల్లడించాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన విషయం తెలిసిందే. అధికారికంగా పేరు మారటంతో 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేయనున్నది. రాష్ట్రాలవారీగా కార్యాచరణపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ దృష్టి సారించనున్నారు. చేపట్టబోయే కార్యక్రమాలు, కార్యాచరణ వివరాలను శుక్రవారం నిర్ణయించే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా అభివృద్ధి
దేశవ్యాప్తంగా కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృ ద్ధి అన్ని రాష్ట్రాలకు విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ ప్రజలకి ఒక ప్రత్యామ్నా య రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభం కావ డం ఆహ్వానించదగ్గ పరిణామం. మ తం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రగుల్చుతున్న బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ రాష్ట్ర సమితికి మద్దతిచ్చి దేశంలో గుణాత్మకమైన మార్పునకు అందరం సహకరిద్దాం.
– దేవీప్రసాద్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు టీఆర్ఎస్ ఎంపీలు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాక
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్న ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, మన్నె శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు.
ఎలక్షన్ కమిషన్ క్షమాపణ చెప్పాలి
తెలంగాణ రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ ఎలక్షన్ కమిషన్ వి డుదలచేసిన లేఖలో పార్టీ ఆఫీస్ అడ్రస్‌ను ఆంధ్రప్రదేశ్‌గా పేర్కొనడం బాధాకరమని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నదని, ఇప్పటికే అనేక రంగాల్లో నంబర్ వన్ ప్లేసులో ఉన్నదని, అయి నా.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం లేఖలో హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ప్రస్తావించడం సరికాదని పేర్కొన్నారు. ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? లేక ఏమరపాటు వల్ల జరిగిందా? అనేది ఈసీ వెల్లడించాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశం కోసం కేసీఆర్ వస్తున్నారు
మాజీ ఎంపీ రాపోలు
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశ ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు కోసం కేసీఆర్ వస్తున్నారని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ తెలిపారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన తర్వాత ఆయన ట్వీట్ చేశారు. నదీ జలాలతో వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు, అత్యాధునిక విధానాలు తీసుకొచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కేసీఆర్ వస్తున్నారని తెలిపారు.