మహబూబ్‌నగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సొంత ఇలాకా ఉమ్మడి పాలమూరులో (Palamuru) తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని (Congress) ఉలికిపాటుకు గురిచేశాయి. జిల్లాలో సీఎం సొంత మండలం సహా ఎమ్మెల్యేల సొంత ని యోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ముఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కారు జోరుతో హస్తం డీలాపడింది. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల ను గులాబీ పార్టీ కైవసం చేసుకోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైంది. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి పరిసర గ్రామాల్లోనూ గులాబీ మద్దతుదారుల గెలుపుతో హస్తం నేతలు కంగుతిన్నారు.
సీఎం సొంత జిల్లాలో ఆ పార్టీ చతికిలబడటంతో అధిష్ఠానం లో కలవరం మొదలైంది. గెలుపు ధీమాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మలి, తుది విడత పంచాయతీ పోరుపై ఆందోళన నెలకొన్నది. ఆ ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు వస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని భావించిన ఆ పార్టీ నేతలు బీజేపీతో జతకట్టి కారుకు బ్రేకులు వే యాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆ జిల్లాలో తొలి విడత ఫలితాలను విశ్లేషించుకున్న ఆ పార్టీ అధిష్ఠానం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల ఎమ్మెల్యేలపై సీరియస్ అయినట్టు తెలిసింది. ఫలితాలు ఇలాగే ఉంటే పార్టీకి నష్టమని హెచ్చరికలు చేయడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాజాగా పల్లెల బాటపట్టారు. పరిస్థితిని ఆషామాషీగా తీసుకుంటే వేరేలా ఉంటుందని గుస్సా అయినట్టు సమాచారం.
తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని రెండు జిల్లాలు మినహా మిగతా అన్నిచోట్ల గులాబీ హవా స్పష్టంగా కనిపించింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ పునాదులనే కదిలించాయి. సీఎం సొంత జిల్లా అయినా పల్లె ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో బీఆర్ఎస్ మద్దతుతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అనిరుధ్‌రెడ్డి సొంత మండలంలో కారు జోరు స్పష్టమైంది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మంత్రాంగం నడపడంతో అనిరుధ్‌రెడ్డి సొంత మండలమైన రాజాపూర్‌లో 24 జీపీల్లో బీఆర్ఎస్ ఏకంగా 18 కైవసం చేసుకున్నది. ఇక్కడ కాంగ్రెస్ కేవలం నాలుగు సర్పంచ్ పదవులనే దక్కించుకున్నది.
మహబూబ్‌నగర్ రూరల్ మండలకేంద్రంలో 24 పంచాయతీలు ఉండగా బీఆర్ఎస్ ఏకంగా 12 దక్కించుకున్నది. అధికార పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన స్వతంత్రులుగా గెలిచిన సర్పంచులు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో అధికార పార్టీ కంగుతిన్నది. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో కారు గుర్తును గెలిపించడంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కీలకపాత్ర పోషించారు. వనపర్తి జిల్లాలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హవా కొనసాగింది. ఇక్కడ 87 స్థానాల్లో ఏకంగా 35 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలోనూ బీఆర్ఎస్ సత్తా చాటింది. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఏకంగా సీఎం సొంతూరు చుట్టుపక్కల పల్లెల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. కొండారెడ్డిపల్లిలోనూ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలుపొందారు.
తొలి విడత ఫలితాలు గులాబీ దళానికి అనుకూలంగా రావడంతో రెండు, మూడో విడతలో ఎలాగైనా కారు జోరును తగ్గించేందుకు కాంగ్రె స్, బీజేపీ జతకట్టాయి. ఓట్లు చీలిపోకుండా ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతివ్వాలని, స్థానిక బీజేపీ నేతలతో చర్చలు జరుపాలని ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో ఎమ్మెల్యే యెన్నం శ్రీ నివాస్‌రెడ్డి రహస్య మంతనాలు జరిపినట్టు స మాచారం. కాంగ్రెస్ బలంగా ఉన్నచోట్ల బీజేపీ క్యాడర్ కాంగ్రెస్‌కు ఓట్లు వేసేలా చూడాలని.. ఒకవేళ కమలం పార్టీ బలంగా ఉన్న వార్డులు, సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని సమాచారం. సీఎం సొంత జిల్లాలో పరువు పోకుండా ఉండేందుకు బీజేపీతో జతకట్టడం ఏమిటని కాంగ్రెస్ వాదులు తిరగబడుతున్నారు.
బీఆర్ఎస్ను టాప్‌గేర్ ఎక్కించడంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సఫలమయ్యారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. పాలమూరు జిల్లాలో తొలి విడత 139 స్థానాల్లో ఏకంగా 64 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. వనపర్తి జిల్లాలో 35 చోట్ల, నాగర్‌కర్నూల్ జిల్లాలో 56 చోట్ల గులాబీ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. మరో 20 స్థానాల్లో అత్యంత తక్కువ ఓట్లతో ఓడిపోవడం గమనార్హం. స్వతంత్రులుగా గెలిచిన చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మిగిలిన రెండు విడతల్లో పరువు కాపాడుకునేందుకు ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో బీజేపీ నేతలతో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతూ ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్కు దక్కకుండా చూడాలని కాంగ్రెస్ క్యాడర్‌కు ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కారు జోరు స్పష్టంగా కనిపించడంతోపాటు మరో 20 స్థానాల్లో తక్కువ ఓట్లతో పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకటి నుంచి 15 ఓట్ల తేడాతో 8 స్థానాలు దక్కకుండా పోయాయి. వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 12చోట్ల తక్కువ ఓట్లతో గులాబీ పార్టీ మద్దతుదారులు ఓడిపోయారు. ఒకవేళ ఈ స్థానాల్లో గెలిచి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు, తుది విడతల్లో పరువు కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతున్నది.