హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ) : 500 రోజుల్లో రేవంత్‌రెడ్డి పీడిత ప్రభుత్వం పోవడం.. మళ్లీ కేసీఆర్ పాలన రావడం ఖాయంమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ గడ్డపై ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండానే అని, గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతమ్మనే అని స్పష్టం చేశారు. ‘మళ్లీ వచ్చేది పేదల సర్కారే.. ఎందుకంటే గరిబోళ్ల కడుపులు కొట్టిన ఏ ప్రభుత్వం ఇదివరకు గెలువలేదు.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు అదే గతి పడుతుంది’ అంటూ కుండబద్దలుకొట్టారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పెద్దసంఖ్యలో ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టిన చందంగా కాంగ్రెస్ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తూ చిరువ్యాపారుల పొట్టగొడుతున్నారని ఆగ్రహం వ్యకం చేశారు. దందాలు చేస్తూ చందాల వసూళ్లలో మునిగితేలుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ పాలనలో పైనుంచి కిందివరకు నెగెటివ్ పాలిటిక్స్, నెగెటివ్ ఆలోచనలు తప్ప ప్రజలకు చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. రెండేళ్లలో ఏనాడూ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లలేదని దుమ్మెత్తిపోశారు.
వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, చందమామను తెచ్చిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి, నిధుల్లేవని, అప్పుల సాకుతో తప్పించుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ గల్లీలకొచ్చి మళ్లీ ఇవే చావుతెలివితేటలు ప్రదర్శిస్తున్నారని మండిపడ్డా రు. ఓటుకు ఐదువేలు పంచిపెట్టే కుట్రలకు తెరలేపుతున్నారని నిప్పులు చెరిగారు. మాయమాటలు చెప్తూ అరచేతిలో స్వర్గం చూపుతూ ఓటర్లను బురిడీ కొట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలను దోచుకున్న కాంగ్రెస్ నేతలు ఇచ్చే పైసలు తీసుకోవాలని, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని కోరారు. ముల్లును ముల్లుతోనే తీయాలని, మోసాన్ని మోసంతోనే జయించాలని, చేతిలో ఉన్న ఆయుధాన్ని ఉపయోగించి చెయ్యి పార్టీకి తగిన బుద్ధిచెప్పాలని విజ్ఞప్తిచేశారు. ప్రజలు తెలివిగా ఆలోచించాలని, పొరపాటు చేస్తే మరో మూడేండ్లు చుక్కలు చూడాల్సి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
నోట్లకట్టలిచ్చినా, కడుపుల తలపెట్టినా హస్తంపార్టీ నేతలకు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయం. మోసపూరిత ప్రభుత్వాన్ని సాగనంపడం తథ్యం. వచ్చేది పేదల పక్షపాత ప్రభుత్వమే.. ఆకురౌడీలు, చిల్లర గూండాలకు భయపడాల్సిన అవసరం లేదు. చిరువ్యాపారులను కడుపులో పెట్టుకొని చూసుకుంటం.
– కేటీఆర్
ఆకు రౌడీలైన కాంగ్రెస్ నేతల బెదిరింపులకు భయపడవద్దని జూబ్లీహిల్స్ ఓటర్లను కేటీఆర్ కోరారు. ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. అధైర్యపడవద్దని బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మొన్న పెద్దమ్మ మాదిరిగా ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలని, అవసరమైతే గల్లాపట్టి గట్టిగా అడగాలని పిలుపునిచ్చారు. అన్నీ ఆలోచించి మేలు చేసేవారేవరో, ఇబ్బందులు పెట్టేవారేవరో గుర్తెరిగి తగిన తీర్పు ఇవ్వాలని కోరారు. కారుకు ఓటేసి బేకార్ కాంగ్రెస్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో దెబ్బకొడితేనే ఆరు గ్యారెంటీలు అమలతాయని, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆడబిడ్డలకు తులం బంగారం వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని అభిలషించారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ షఫీ, బీఆర్ఎస్ నాయకులు రాంచంద్రునాయక్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, కిశోర్‌గౌడ్, ఎంఐఎం నాయకులు వాజిద్, ఫిరోజ్‌ఖాన్, అబ్దుల్లా, పర్వేజ్ పాల్గొన్నారు.
రెండేళ్లలో రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది. అన్నిరంగాలు, అన్నివర్గాలను అతలాకుతలం చేసింది. దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో జీవో 58, 59 తెచ్చి 1.50 లక్షల మంది పేదలకు ప్లాట్లు ఇచ్చిండ్రు. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించిండ్రు.. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచి నాలుగుకోట్ల ప్రజలను నట్టేట ముంచింది.
-కేటీఆర్
ఆరు గ్యారెంటీలకు పాతరేసి అబద్ధాల జాతరకు రేవంత్ సర్కారు తెరలేపిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు తులం బంగారం, యువతులకు స్కూటీలు, ముసలోళ్లకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్లు ఇస్తామని మోసం చేసిందని దుయ్య బట్టారు. గద్దెనెక్కి 800 రోజులు దాటినా గ్యారెంటీల ఊసెత్తడంలేదని విమర్శించారు. వాగ్దానాలేవీ నెరవేర్చలేదు గాని ఇండ్లు మాత్రం కూలగొడుతున్నారని మండిపడ్డారు. చెరువుల్లో కట్టుకున్న పెద్దోళ్లు, కాంగ్రెస్ నేతల ఇండ్లను వదిలిపెట్టి శని, ఆది వారాల్లో పేదోళ్ల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపుతూ రాక్షసానందం పొందుతున్నారని తూర్పారబట్టారు.