హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ పాలనలో 90 శాతం నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంపై కాంగ్రెస్ సర్కారు నిర్ల క్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. రేవం త్ ఏడాది పాలనలో ప్రతి పక్షాలు, రైతులపై కేసులు పెట్టడం, డైవర్షన్ డ్రామాలు తప్ప సాధించిందేమీలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో పర్యావరణ, అటవీ అనుమతులు సాధించి, అహోరాత్రులు శ్రమించి నిర్మించిన ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని మీడియాలో దుష్ప్రచారం జరగడం ఆందోళన కలిగిస్తున్నదని వాపోయారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు ద్వారా 12 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఏపీ సర్కారు ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేసినా, కేంద్రం డీపీఆర్‌ను వెనక్కి తీసుకున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు.
శ్రీశైలం ప్రాజెక్టుపై పెత్తనం చలాయించి నీళ్లను తరలించుకుపోయేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విడ్డూరమన్నారు. ఇంత అన్యాయం జరుగుతున్నా ఇదే జిల్లాకు చెందిన సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టును పూర్తిచేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ సస్యశ్యామలమవుతుందని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని, ఏపీ ప్రభుత్వంతో చర్చించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యాచరణ ప్రకటిస్తామని తేల్చిచెప్పారు.