మంచిర్యాల, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా, మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలకు పాల్పడినా.. క్యాతనపల్లిలో చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పేర్కొన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ పీఠం దక్కించుకోవడం కోసం అక్రమ కేసులు, లాఠీచార్జీలు, కుట్రలు చేయకుండా ప్రజాతీర్పునకు ఆ నాడే గౌరవం ఇచ్చి ఉంటే.. ఈ రోజు ఎన్నికకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేదా..అని మంత్రి వివేక్‌ను ప్రశ్నించారు. క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్లు ఎన్నికైన సందర్భంగా క్యాతన్‌పల్లిలోని తన నివాసంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. అధికారం ఉందని ఎలా పడితే అలా చేస్తామంటే ప్రజాక్షేత్రంలో ద్రోహులుగా నిలబడక తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు 14 మంది ఒక్కతాటిపై నిలబడి క్యాతనపల్లి, రామకృష్ణాపూర్ పరువు నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఈ పాలకవర్గం మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మంత్రి వివేక్ సైతం ఫాల్స్ ప్రెస్టేజీకి పోకుండా క్యాతనన్పల్లి మున్సిపల్ అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు తీసుకురావాలని కోరారు.
క్యాతన్‌పల్లి ఎన్నికల్లో గెలుపు రాబోయే ఎ న్నికల్లో బీఆర్ఎస్ విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నాం. 10మంది బీఆర్ఎస్, నలుగు రు సీపీఐ కౌన్సిలర్లు ఈ గెలుపుతో ఈ దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు. క్యాతన్‌పల్లి ప్ర జలందరి గౌరవాన్ని కాపాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రలోభాలకు లొం గకుండా కౌన్సిలర్లు చూపించిన ఈ స్ఫూర్తి, ప ట్టుదల రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలి. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు. క్యాతన్పల్లితో పాటు బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలన్నింటినీ కేసీఆర్‌కు కానుకగా ఇస్తున్నాం.
– మాజీ మంత్రి గంగుల కమలాకర్
క్యాతన్‌పల్లిలో శాంతియుతంగా సాగాల్సిన ఎన్నికను, అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ప్రజాతీర్పునకు కట్టుబడి ఉండకుండా మంత్రి వివేక్ ప్రజల్లో ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 17న బీఆర్ఎస్ ఇన్చార్జిగా వచ్చిన నాపై కేసు పెట్టారు. మా బీఆర్ఎస్ నాయకులను కొట్టి ఉల్టా మాపైనే కేసులు పెట్టారు. కాంగ్రెస్ అరాచకాలతో 51 రోజులు ఊరికి, ఇంట్లో వాళ్లకు దూరంగా ఉన్నా ఏకతాటిపై నిలబడిన బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లకు ప్రత్యేక అభినందనలు.
– ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి