హైదరాబాద్ జూన్ 28 (నమస్తేతెలంగాణ) : అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని యూత్ డిక్లరేషన్‌ను అమలు చేస్తామని హామీలిచ్చి రేవంత్ సర్కారు తమను నిండా ముంచిందని నిరుద్యోగులు కన్నెర్ర జేశారు. గోడు వెళ్లబోసుకొనేందుకు జనతా గ్యారేజ్ (తెలంగాణ భవన్)కు శనివారం దండులా కదలివచ్చారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో పెద్దసంఖ్యలో విద్యార్థులు, నిరుద్యోగులు తెలంగాణ భవన్‌కు వచ్చి మాజీ మంత్రి హరీశ్‌రావు, ప్రజాసంఘాల నాయకులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని వివరించి ఆవేదన వెళ్లగక్కారు. ఏడాదిన్నరగా జరుగుతున్న అన్యాయాన్ని సోదాహరణంగా వివరించారు.
ఉద్యోగాలు అడిగిన తమపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదని వాపోయారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని విన్నవిస్తే పార్టీ నాయకులతో దాడులు చేయిస్తున్నదని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన పాపానికి పెయిడ్ ఆర్టిస్టులుగా చిత్రీకరిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా చేశారని, ఇంజినీరింగ్ పోస్టుల భర్తీ ముచ్చటే లేదని, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల ఊసేలేదని, విలేజ్ పంచాయతీ ఆఫీసర్ల పోస్టుల భర్తీ మాట నీటిమూటే అయిందని మండిపడ్డారు. ధర్నాలు, నిరసనలకు దిగినా, నిరాహార దీక్ష చేసినా చివరికి ఢిల్లీలో ఆందోళన చేసినా సర్కారు కండ్లు తెరవడం లేదని విరుచుకుపడ్డారు.
గతంలో బీఆర్ఎస్ ఉద్యోగాలివ్వదని, కాంగ్రెస్‌కు ఓటేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పిన కోదండరాం, ఆకునూరి మురళి లాంటి మేధావులు, రియాజ్, బల్మూరి వెంకట్ లాంటి ఎన్ఎస్యూఐ నేతలు పదవులు రాగానే పెదవులు మూసుకున్నారని నిప్పులు చెరిగారు. ఇక ఓపిక నశించిందని, సర్కారుపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమని కార్యాచరణ ప్రకటించారు. జూలై 4న వేలాది మందితో ‘హలో నిరుద్యోగి..చలో సెక్రటేరియట్’ పేరిట భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నామని వెల్లడించారు. నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టి నట్టేట ముంచిన రేవంత్ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వారి సమస్యలు తెలుసుకున్న హరీశ్‌రావు నిరుద్యోగుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. భేటీలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
సర్కారుపై తిరగబడుతం
కాంగ్రెస్ పార్టీ ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఏడాదిన్నరలో కేవలం 11 వేల ఉద్యోగాలే ఇచ్చి మొండి చెయ్యి చూపింది. నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగితే ఎస్సీ వర్గీకరణ పేరిట వాయిదా వేస్తూ తప్పించుకుంటున్నది. మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఇక సహనం నశించింది. అన్ని పార్టీల మద్దతు కూడగడుతం. ఇప్పటికే సీపీఎం నాయకులను కలిసినం. ఇవ్వాలా మీడియా ముందే హరీశ్‌రావు వద్దకు వచ్చినం. పార్టీల ముద్ర వేసినా పట్టించుకోం. అన్నీ పార్టీలు, ప్రజాసంఘాల అండతో కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు చేస్తం.
-మోతీలాల్ నాయక్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్
ఉద్యోగాలపై రేవంత్ పచ్చి అబద్ధాలు
ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఓట్ల కోసం నిరుద్యోగుల చుట్టూ తిరిగిండు. రాహుల్‌గాంధీని తీసుకొచ్చి మాయమాటలు చెప్పించిండు. గద్దెనెక్కిన తర్వాత ప్లేటు ఫిరాయించిండు. 18 నెలల్లో కేవలం 11 వేల ఉద్యోగాలే ఇచి చ 60 వేలని అబద్ధాలు చెప్తున్నడు. జాబ్‌క్యాలెండర్ ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిన మాటకు విలువలేకుండా పోయింది. మార్చిలో మెగా డీఎస్సీ అని ఊదరగొట్టి చేతులు దులుపుకొన్నరు. దగా చేసిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పేందుకు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నరు.
-వికాస్
నాడు రెచ్చగొట్టి నేడు మోసం
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేస్తే ఉద్యోగాలు రావని, కాంగ్రెస్‌కు ఓటేస్తే 2 లక్షల జాబ్‌లు వస్తాయని కోదండరాం, ఆకునూరి మురళి నూరిపోసిండ్రు. అశోక్‌నగర్‌కు తిరిగి తిరిగి మమ్మల్ని నమ్మించిండ్రు. ఇప్పుడు వాళ్లకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగులను పట్టించుకుంటలేరు. రేవంత్‌రెడ్డి గ్రూప్-2లోని 783 పోస్టులను 2 వేలకు పెంచుతామని హమీ ఇచ్చిండ్రు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ అని నమ్మబలికి మంత్రి పొన్నంకు బాధ్యతలు అప్పగిస్తున్నమని అబద్ధాలాడిండ్రు. నమ్మించి నిండా ముంచిన దగాకోరు కాంగ్రెస్‌కు లోకల్‌బాడీ ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధిచెప్తం. హలో నిరుద్యోగి.. చలో సెక్రటేరియట్ చేపట్టి ప్రభుత్వ మోసాన్ని ప్రజలకు వివరిస్తం.
-సింధు, గురప్పగూడెం( నల్లగొండ)
ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్సోళ్ల గల్లాపడ్తం
అధికారం కోసం నిరుద్యోగులకు రేవంత్ అడ్డగోలు హామీలిచ్చిండ్రు. సరూర్‌నగర్‌లో సభ పెట్టి ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ఇప్పించిండ్రు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు 4వేల భృతి ఇస్తామని ఎన్నెన్నో హామీలిచ్చిండ్రు. ఏడాదిన్నర దాటినా ఏ ఒక్కటీ అమలు చేయడంలేదు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. త్వరలోనే పెద్ద ఆందోళనకు దిగుతం. ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లా పట్టుకొని అడుగుతం.
-ఝాన్సీరాణి, మేడ్చల్( మేడ్చల్ మల్కాజిగిరి)
ఓయూకి వచ్చి నమ్మించిండ్రు
కాంగ్రెస్ నాయకులు నాడు ఓట్ల కోసం దొంగ హామీలు ఇచ్చిండ్రు. ఓయూ లైబ్రరీలో విద్యార్థుల వద్దకు వచ్చి కాంగ్రెస్‌కు ఓటేస్తే 2 లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మబలికిండ్రు. బీఆర్ఎస్కు ఓటేయవద్దని చెప్పిండ్రు. తెలంగాణలో బస్సుయాత్ర చేయాలని కోరిండ్రు. కానీ అధికారంలోకి వచ్చినంక ఉద్యోగాల ఊసే మరిచిపోయిండ్రు. నోటిఫికేషన్లు వేయాలని అడిగితే తప్పించుకుంటున్నరు. దగా చేసిన ప్రభుత్వానికి బుద్ధిచెప్పేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నం.
– రవితేజ