Municipal Elections | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు ఒడిగడుతున్నది. ప్రజాక్షేత్రంలో నిలబడి తలబడలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నది. ప్రజాబలం ఉన్నచోట బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో ఉంటే తాము గెలువలేమని నిర్ధారించుకొని బలప్రయోగానికి దిగుతున్నది.
నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీల్లో దౌర్జన్యకాండకు దిగింది. కండబలం, ఖాకీబలంతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడింది. జనగామ, కోదాడ, వికారాబాద్, మంచిర్యాల, యాదాద్రి, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్ సహా అనేక జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు గురిచేసి పోటీ నుంచి బలవంతంగా తప్పుకొనేలా చేయడం సర్వత్రా విమర్శలువెల్లువెత్తుతున్నాయి. పార్టీరహితంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎవరు గెలిచినా తమ వారే అని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్.. పార్టీ గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో తమ పప్పులు ఉడకవని ముందే గ్రహించింది. అందుకే అడ్డదారిలో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో నుంచి తప్పించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి ఉమ్మడి మహబూబ్‌నగర్ అలంపూర్ మున్సిపాలిటీలోని 10వ వార్డు బీఆర్ఎస్కు ఏకగ్రీవమైంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్నికకావడం చర్చనీయాంశమైంది. సీఎం సొంత జిల్లాలోనే గట్టి షాక్ తగలడంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నఫలంగా అప్రమత్తమైంది.
ఎన్నికలు జరిగే అన్ని మున్సిపాలిటీల్లో ‘బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయండి. దారికి రాకపోతే ఉపసంహరణ గడువు పూర్తయ్యేలోగా వారు ఆ పార్టీ బీఫామ్ సమర్పించకుండా చేయండి. అప్పటికీ కాదూ, కూడదు ‘పోటీచేసి తీరుతాం’ అని బెట్టు చేసేవారికి మన పార్టీ బీఫామ్ ఇచ్చి బరిలో ఉండేలా చేయండి’ అంటూ ఆ పార్టీ పెద్దలు హుకుం జారీచేశారు. ఆ ఒక్క హుకుంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. అందబాటులో ఉన్న అడ్డదారులన్నీ తొక్కారు. కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ అక్కడక్కడా ఆందోళనలు చేపట్టింది. ఆయా మున్సిపాలిటీల పరిధిలోని ఎమ్మెల్యేల తీరుకు నిరసనగా వారి దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో నిలబడి గెలువలేక దుర్మార్గాలకు ఒడిగడుతున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బరి తెగించారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ 16వ వార్డులో బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గండమాల కృపానందం (గ్యాస్ నాని)ని బెదిరించి, బలవంతంగా నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా యత్నించారు. స్థానికులు, బీఆర్ఎస్ నాయకుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం గ్యాస్ నాని ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని భయభ్రాంతులకు గురిచేసి అదే కారులో నామినేషన్ విత్‌డ్రా కోసమని మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. అప్పటికే 45 నిమిషాలు ఆలస్యమైంది. దీంతో ఆయన విత్‌డ్రాకు ఎన్నికల అధికారులు నిరాకరించారు. సమయం అయిపోయిందంటూ తిరస్కరించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యాదాద్రి-భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ఆవుల మమతాసాయి యాదవ్‌ను స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రలోభాలతో నామినేషన్ ఉపసంహరించేలా చేశారని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రూ.3 కోట్లకు అభ్యర్థిని కొనుగోలు చేశారని ఆరోపించారు. నిరసనగా మంగళవారం యాదగిరిగుట్టలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే తీరుపై నిరసన ర్యాలీని నిర్వహించారు. 12 వార్డు బీఆర్ఎస్ అభ్యర్థికి ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కింది. గెలువలేక పట్టు సాధించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎరవేసింది. బీఫామ్ సమర్పించే సమయంలో 17వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చింతల ఉమామహేశ్వరి బీఫామ్‌ను వేయకుండా చేసి అదే వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పస్తం మల్లమ్మను పోటీ నుంచి విరమింపజేసి ఉమామహ్వేరికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. దీంతో ఉమామహేశ్వరి కాంగ్రెస్ బీఫామ్ సమర్పించడం ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రలోభపర్వం తృటిలో తప్పింది. మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డుకు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థి నసీమాబేగం ఇంటికి మంగళవారం వెళ్లిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు నాయకత్వంలోని కాంగ్రెస్ నేతలు వెళ్లారు. తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నారనే విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వెంటనే అక్కడికి చేరుకున్నారు. తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు ప్రలోభాలకు గురిచేస్తూ, ఉపసంహరించుకోవాలని ఒత్తిడి ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. చివరికి తాను మర్రి జనార్దన్‌రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్తోనే పనిచేస్తానని నసీమాబేగం తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ నేతలు తిరుగుముఖం పట్టారు.
శాసనసభ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకొన్నది. బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని దుర్మార్గానికి ఒడిగట్టిందనే ప్రచారం జరుగుతున్నది. మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో పోటీచేసి గెలిచే అవకాశాలు లేకపోవడంతోనే బీఆర్ఎస్ అభ్యర్థులను ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తన కూతురును మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేసేందుకు గాను స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధికారులు, పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఆరోపించారు.
కోదాడలో ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థిని ఏకంగా కిడ్నాప్ చేశారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, బూడిద భిక్షమయ్యగౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలువలేక 11వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రసాద్‌ను కాంగ్రెస్ దుండగులు కిడ్నాప్ చేశారని, తక్షణమే పోలీసులు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నేరుగా గెలువలేక దొడ్డిదారిన కాంగ్రెస్ నాయకులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ అభ్యర్థిని కిడ్నాప్ చేసి అదే వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవమైందని ప్రకటింపజేసుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.