హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ కార్యకలాపాలు పెరుగుతాయని, పార్టీలో చేరుతామంటూ చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…
‘దేశాన్ని సమూలంగా అభివృద్ధి చేసే మహాయజ్ఞంలో ఏపీ ప్రజలు పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. గొప్పగా పనిచేద్దాం. బీఆర్ఎస్లో చేరి పనిచేసిన వారికి స్వాతంత్య్ర పోరాటంలో పనిచేసిన వారికి దక్కిన గౌరవం భవిష్యత్తులో దక్కుతుంది. ఒక ప్రాంతం, ఊరు, రాష్ట్రం కోసం కాదు. దేశ ప్రజల స్థితిగతులు, స్వరూపాన్ని మార్చే మహోద్యమంలో కంకణబద్ధులుగా పనిచేద్దాం. సంక్రాంతి తర్వాత ఏడెనిమిది రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పరుగులు పెట్టనున్నది. అన్ని రాష్ర్టాల్లో శాఖల ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ఊహకు అందనంత మంది బీఆర్ఎస్లో చేరుతామంటూ ఏపీ నుంచి ఫోన్లు చేస్తున్నారు.
సంక్రాంతి మరునాటి నుంచి ఏపీ బీఆర్ఎస్లో తట్టుకోలేనంత ఒత్తిడి ఉంటుంది. ఏపీలో ఆశ్చర్యపరిచే చేరికలు త్వరలోనే ఉంటాయి. గొప్ప వ్యక్తులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలామంది ఫోన్ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలే అయినా రాష్ట్రంలో ఫిట్టింగ్ లేదని అంటున్నారు. సంక్రాంతి తర్వాత ఏపీలో కార్యకలాపాలు పెరుగుతాయి. త్వరలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయి’ అని కేసీఆర్ తెలిపారు.