Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు, సాగునీరందక ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంటే.. రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణమంటున్నారు. చేతికొచ్చిన పంట ఎండిపోవడంతో, అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇవేమీ రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా, రైతుల ఆత్మహత్యలపై ఆధారాలు చూపాలని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో 9 ఏండ్ల కింద రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ కార్యకర్తలు, నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
2015లో వచ్చిన కరువు వల్ల చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని అప్పట్లో రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి అదే తరహాలో ఇప్పుడు కరువు రావడం వల్ల చనిపోయిన 209 మంది రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం అని బీఆర్ఎస్ కార్యకర్తలు, నెటిజన్లు పేర్కొన్నారు.
నాడు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.. ‘ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినయ్. చనిపోతున్న రైతుల పట్ల వారు కొంచెం కూడా కరుణ చూపించడం లేదు. వాళ్ల మీద కనీసం జాలి కూడా చూపించడం లేదు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడం వల్ల ఆందోళనకు, ఆవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఒక నమ్మకాన్ని కలిగించాలి. అదే విధంగా ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర మంత్రులు సమీక్షించక పోవడం వల్లనే ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఈ ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హత్యలే అని చెప్పక తప్పదు. రాష్ట్ర మంత్రివర్గం మీద హత్యానేరారోపణల మీద కేసులు నమోదు చేసి, విచారణ జరిపించి, వీరిని లోపల వేస్తే తప్ప రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మరి ఆనాడు ఆత్మహత్య చేసుకున్న రైతుల విషయంలో ప్రభుత్వానిది తప్పు అయితే.. ఇప్పుడు కూడా ప్రభుత్వానిదే నేరం అవుతుంది కదా..? అని బీఆర్ఎస్ కార్యకర్తలు, నెటిజన్లు నిలదీస్తున్నారు. ఇప్పుడు మీ మంత్రివర్గం మీద కూడా కేసులు నమోదు చేయాలి కదా..? మిమ్మల్ని కూడా లోపల పడేయాలి కదా..? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అన్నం పెట్టే రైతుల విషయంలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని నెటిజన్లు రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
9 ఏండ్ల కింద రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం
2015లో వచ్చిన కరువు వల్ల చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని అప్పట్లో డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.
అదే తరహాలో ఇప్పుడు కరువు రావడం వల్ల చనిపోయిన 209 మంది రైతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరుతున్నాం. https://t.co/Z9lLmQRMMy pic.twitter.com/aqVrKOuYmh
— Telugu Scribe (@TeluguScribe) April 3, 2024