కరీంనగర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) కారు జోరుకు అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ కంగుతున్నది. ‘అన్నీ మావే’ అన్న రీతిలో అధికార దర్పం ప్రదర్శించినా, నజరానాలతో ఓట్లు దండుకోవాలని ప్రయత్నించినా ఆ పార్టీకి షాక్ తగిలింది. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగంలోకి దిగి, పరోక్షంగా పల్లెల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసినా.. ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు ముందు హడావుడిగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలకు బతుకమ్మ చీరలు, వడ్డీలేని రుణాల పంపిణీ, మహిళా భవనాలకు శంకుస్థాపనలు, ఇందిరమ్మ ఇండ్లకు బిల్లుల చెల్లింపులు, అర్ధరాత్రి పూట మంజూరు పత్రాల పంపిణీ, ప్రజలను నమ్మించేందుకు బాండు పేపర్లు.. ఇలా ఎన్నెన్నో నజరానాలు చూపించినా ఓటర్లు కాంగ్రెస్కు అండగా నిలువలేదు.
అధికారంలేకపోయినా బీఆర్ఎస్ పార్టీని ప్రజ లు గుండెల్లో పెట్టుకున్నారు. మైనర్, మేజర్ గ్రామ పంచాయతీలు అన్న తేడా లేకుండా.. ప్రతి పల్లెలోనూ కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా అధికార పార్టీకి అనుకూలంగా వస్తాయి. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే దాదాపు 80% వరకు గెలిచిన దాఖలాలు గతంలో ఉన్నాయి. కానీ, ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొదటి విడత ఎన్నికల్లోనే కాంగ్రెస్ డీలా పడిపోయింది. తొలి విడతలో ఏకగ్రీవాలతో కలుపుకొని ఆ పార్టీ 2,342 పంచాయతీలనే గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1,388 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు.
రెండేండ్ల పాలనలో పల్లెలను గాలికొదిలేసిన రేవంత్ సర్కార్, పంచాయతీ ఎన్నికలకు వారం ముందుగా ప్రేమను ఒలకబోసే ప్రయత్నాలు చేసింది. మహిళలకు వడ్డీలేని రు ణాలు, బతుకమ్మ చీరలు ఆగమేఘాల మీద పంపిణీ చేసింది. మెజారిటీ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను రాత్రికి రాత్రే పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి, మం త్రులు, ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఈ తరహా పనులు రాత్రిపూట చాలా మేరకు చేశారు. ఆగమేఘాల మీద మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు బాండ్ పేపర్లతో కూడిన హామీలిచ్చారు. నెరవేర్చకపోతే ఏడాదిలో రాజీనామా చేస్తామంటూ నమ్మించే ప్రయత్నాలు చేశారు.అయినా పల్లె ప్రజలు నమ్మలేదు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావి తం చేసేందుకు స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ప్రయత్నించారన్న విమర్శలొచ్చాయి. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట ఆయన పలు జిల్లాల్లో పర్యటించారు. పల్లెల్లో ఎన్నికల కోడ్ ఉండటంతో పక్కన మున్సిపాలిటీలు, పట్టణాలను కేంద్రంగా చేసుకొని అధికారిక పర్యటన చేశారు. ఆదిలాబాద్, మహబూబ్నగర్, సిద్దిపేట, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో భారీ సభ లు నిర్వహించారు. అయినా మహిళలు బీఆర్ఎస్ పక్షానే నిలిచి, కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నారు. మహిళా ఓటింగ్ శాతం ఎక్కువగా జరిగిన పంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలవడం విశేషం.
రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునే బీజేపీ, అట్టడుగు స్థాయికి చేరుకున్నది. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఇతరులు 311 మంది విజయం సాధించగా బీజేపీ 189 పంచాయతీలకే పరిమితం కావడం గమనార్హం. కాగా ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్.. స్వతంత్రులుగా గె లిచిన సర్పంచ్లను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.