నార్నూర్, నవంబర్ 25 : ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలోని మారుమూల గ్రామాలలో దళారి దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతున్నది. ఆదిలాబాద్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, ఆంధ్రకు సంబంధించిన దళారులు పల్లెల్లో పాతకాంటలతో పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అమాయక రైతులను నిండా ముంచుతున్నారు. ప్రభుత్వం పత్తి క్వింటలుకు ధర రూ.8110 చెల్లిస్తున్నది. తేమశాతం పరిశీలించకుండానే నాణ్యత పేరుతో కోతలు విధిస్తూ రూ.6,300-6,500 వరకు చెల్లిస్తున్నారు.
కొందరు వ్యాపారస్తులు ఆసామిల పేరుతో పంటలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. సీసీఐలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో దళారీ దందాకు అడ్డుకట్ట లేకుండా పోయింది. సంబంధిత శాఖ అధికారులు గ్రామాలలో పర్యటించిన వాహనాలు పట్టిన ఎంతో కొంత వారి వద్ద తీసుకొని వాహనాలను వదిలేస్తున్నట్లు విశ్వనీయ సమాచారం. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు దళారుల వ్యవస్థపై ప్రత్యేక నిఘా పెట్టి అరికట్టాలని మండల వాసులు కోరుతున్నారు.