బోథ్, నవంబర్ 12 : ఆదిలాబాద్ జిల్లా బోథ్ రైతువేదికలో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసగా మారింది. బోథ్, సొనాల మండలాల పరిధిలోని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడానికి స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వచ్చారు. స్టేజీ పైకి మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సంధ్యారాణిలను ఎలా పిలుస్తారని ఆత్మ చైర్మన్ రాజుయాదవ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రొటోకాల్ పాటించకుండా పంపిణీ ఎలా చేస్తారని ప్రశ్నించాడు.
ఎమ్మెల్యే సభావేదికపై ఉన్న వారి పేర్లు తెలుపుతుండగా.. కాంగ్రెస్‌కు చెందిన అధికార ప్రతినిధి పసుల చంటి స్టేజీపై ఉన్న బల్లను గుద్ది ఇవన్నీ అవసరమా? అని అనడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలై ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి ఇరువర్గాలను శాంతింపజేశారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడె గజేందర్ నాయకులతో కలిసి బైఠాయించారు. డీఎస్పీతోపాటు సీఐ గురుస్వామి, ఎస్సై శ్రీసాయి వారికి నచ్చజెప్పి పంపించేశారు.