హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 21వ శతాబ్దంలోనూ లింగ వివక్ష కనిపిస్తున్నది. అబ్బాయిల పట్ల ఒకరకంగా.. అమ్మాయిల పట్ల ఒక రకంగా వ్యవహరించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు. పాఠశాల విద్యలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ లింగ వివక్షకు నిదర్శనంగా నిలుస్తున్నది. కొందరు తల్లిదండ్రులు అబ్బాయిలను ప్రైవేట్ స్కూళ్లకు, అమ్మాయిలను సర్కార్ బడులకు పంపిస్తున్నా రు. సర్కార్ బడుల్లో 52% అమ్మాయిలుంటే.. ప్రైవేట్ స్కూళ్లల్లో 54% అబ్బాయిలున్నారు. రాష్ట్రంలో లింగ వివక్ష ఇంకా పూర్తిగా తొలగి పోలేదనేందుకు ఈ గణాంకాలే తార్కాణంగా నిలుస్తున్నాయి. 2026 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూ డైస్) నివేదికలో ఈ అంశం వెలుగుచూసింది.
సర్కార్ బడుల్లో (గురుకులాలు, కేజీబీవీలు, మాడల్ స్కూల్స్) అన్ని కలిపితే విద్యార్థుల సంఖ్య 26,81,580 ఉండగా, వీరిలో 13.94 లక్షలు (52%) అమ్మాయిలున్నారు. సర్కార్ బడుల్లో అబ్బాయిల సంఖ్య 12,87,158(48%) మాత్రమే. అదే ప్రైవేట్స్కూళ్లల్లో మొత్తం 47,51,692 లక్షల మందికి అబ్బాయిలు 26.73(54%) లక్షలుండగా, అమ్మాయిలు 22.77(46%) లక్షలు మాత్రమే. అంటే రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లల్లో అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు 4 లక్షల మంది ఎక్కువగా చదువుతున్నారన్నమాట. అన్ని రకాల సర్కార్ బడులు 28,033 ఉండగా, వీటిల్లో విద్యార్థుల సంఖ్య 26 లక్షలుండగా, ప్రైవేట్ స్కూళ్లు 13,244 ఉండగా, వీటల్లో ఏకంగా 49.51లక్షల మంది విద్యార్థులున్నారు. యాజమాన్యాలవారీగా తీసుకొంటే సర్కార్ బడుల్లో 35% విద్యార్థులుంటే, ప్రైవేట్ స్కూళ్లల్లో 65% విద్యార్థులున్నారు.
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల ఎంపికలోనూ లింగ సమానత్వం కనిపించడంలేదు. ఈ కోర్సుల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సైన్స్ కోర్సుల్లో అమ్మాయిలు అధికంగా చేరుతుండగా, ఆర్ట్స్ కోర్సుల్లో అబ్బాయిలు ఎక్కువగా అడ్మిషన్లు పొందుతున్నారు. బీఎస్సీ గ్రూపులో 64% మంది అమ్మాయిలుంటే, అబ్బాయిలు కేవలం 36% మాత్రమే ఉన్నారు. ఇక బీకాం కోర్సుల్లో అబ్బాయిలు 54శాతముంటే, అమ్మాయిల వాటా 46% మాత్రమే. బీఏ కోర్సుల్లో అబ్బాయిలు 58% అడ్మిషన్లు పొందితే, అమ్మాయిలు 42% మాత్రమే ఉన్నారు.