హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు సర్కారుపై తిరుగుబాటు చేశాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాయి. మంగళవారం ఓయూ పరిధిలో రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలను యాజమాన్యాలు బహిష్కరించాయి. దీంతో సెంటర్ల వద్ద కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరీక్షలకు వచ్చిన విద్యార్థులు టెన్షన్‌కు గురయ్యారు. విద్యార్థులకు నష్టం కలిగించొద్దని కొన్ని కాలేజీల్లో గంట ఆలస్యంగా పరీక్షలు జరుపగా, కొన్ని చోట్ల పరీక్షలు నిర్వహించలేదు. అటానమస్ కాలేజీలు, నాన్ దోస్త్ కాలేజీల్లో పరీక్షలు యథావిధిగా జరిగాయి.
16 నెలలుగా పడిగాపులు..
రూ.2,500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిగ్రీ, పీజీ కాలేజీలు చాలాకాలంగా కోరుతున్నాయి. టోకెన్లు జారీ అయిన రూ.800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నాయి. 16 నెలలుగా పడిగాపులు కాస్తున్నాయి. సర్కారు తీరును నిరసిస్తూ కాలేజీల యాజమాన్యాలు ఇందిరాపార్కులో ధర్నా సైతం నిర్వహించాయి. 2024 అక్టోబర్‌లో సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపి త్వరగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అయినా కాలేజీల యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. ఇప్పటి వరకు 20శాతం బకాయిలు కూడా విడుదల కాలేదు. మార్చి 31లోపు ఇవ్వకపోతే పరీక్షలు బహిష్కరిస్తామని అల్టిమేటం జారీచేసిన క్రమంలోనే బహిష్కరించాయి.