మానకొండూర్ రూరల్/నంగునూరు/చేర్యాల, డిసెంబర్ 7 : పంచాయతీ ఎన్నికల్లో (Panchayathi Elections) చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఏ ఊర్లో చూసినా సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ హామీలను బాండ్ పేపర్‌పై రాసిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లలో సర్పంచ్ పదవి మహిళా జనరల్‌కు రిజర్వు కావడంతో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో గుమ్మడవెల్లి రాజేశ్వరి వినూత్నంగా ముందుకు వెళ్తున్నది. ప్రజలు నమ్మేలా ఓ బాండ్ పేపర్లో తన హామీలను రాసి ఇచ్చింది. అవి నెరవేర్చకపోతే చెప్పులతో సన్మానం చేయించుకొని రా జీనామా చేస్తానని అందులో స్పష్టంచేసింది.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్‌పేటలో సర్పంచ్ అభ్యర్థి చేర్యాల వాణి సంచలనానికి తెరలేపారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడినట్టు రుజువైతే తన వ్యక్తిగత ఆస్తులను గ్రామ పంచాయతీకి రాసిస్తానని బాండ్‌పేపర్‌పై రాసి ఇచ్చారు.
అక్రమంగా సంపాదిస్తే జప్తు చేసుకోవచ్చు
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని తాడూరు సర్పంచ్ అభ్యర్థి బోడిగె నర్సింహులు ఓ బాండ్ పేపర్ రాసి, దానిని గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశాడు. తనను సర్పంచ్‌గా ఎన్నుకుంటే తనతోపాటు తన కుటుంబ సభ్యులు అక్రమంగా ఆస్తులు ఎంత సంపాదించినా వాటిని గ్రామ పంచాయతీ జప్తు చేసి, ప్రజలు పంచవచ్చునని బాండ్ పేపర్లో రాసి సంతకం చేశాడు.