హైదరాబాద్: దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతూనే ఉన్నాయి. గత 16 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వాటిలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, ఎయిర్ ఇండియాకు చెందిన చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఉన్నాయి. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు, సీఐఎస్ఎఫ్ వర్గాలు.. మూడు విమానాలను తనిఖీ చేశారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, గత 16 రోజులుగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 100 విమానాలకు బెదిరింపులు రావడం గమనార్హం. గడిచిన 16 రోజుల్లో మొత్తం 510 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బెదిరింపులు రాగా.. అవన్నీ ఉత్తుత్తివేనని తేలింది. ఈ బెదిరింపులన్నీ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా విమానాలకు మంగళవారం సోషల్ మీడియా ద్వారానే బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై సంబంధిత విభాగాలు తక్షణమే అప్రమత్తమయ్యాయని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు. ఎయిరిండియా, ఇండిగో, విస్తారా సంస్థల విమానాలకు ఎక్స్‌లో బెదిరింపులు రాగా.. గుర్తుతెలియని వ్యక్తులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విమానాలకు బాంబు బెదిరింపులు చేస్తున్న వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని గోండియాకు చెందిన జగదీశ్ ఊకే(35) బెదిరింపు మెయిల్స్ చేస్తున్నట్లు డీసీపీ శ్వేత ఖేద్కర్ వెల్లడించారు. ఇతను ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విమానయాన కార్యాలయాలు, డీజీపీ, రైల్వే రక్షక దళం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకూ బెదిరింపు మెయిల్స్ పంపినట్లు తెలిపారు. అతడు టెర్రరిజంపై పుస్తకం రాయడమే కాక, 2021లో ఒక కేసులో అరెస్టయ్యాడని వెల్లడించారు.