హైదరాబాద్: తెలంగాణ సీఎంఓ, లోక్ భవన్ (రాజ్‌భవన్)కు బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. వాటిని పేల్చేయడానికి కుట్ర చేస్తున్నారని దుండగుడు మెయిల్ పంపాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం ఉందయం ముఖ్యమంత్రి కార్యాలయం (CMO), లోక్‌భవన్ (Raj Bhavan)కు వాసుకీ ఖాన్ పేరుతో ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వీఐపీలు, ప్రముఖులను అందులో నుంచి ఖాళీ చేయించారు. బెదిరింపులు రావడంతో గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మెయిల్‌పై దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. విమానాలు టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో బాంబు పేలుస్తామని అందులో హెచ్చరించారు. బాంబు పేలకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. బెదిరింపులకు పాల్పడింది న్యూయార్క్‌కి చెందిన జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.