మల్యాల/ కొడిమ్యాల, మే 19 : రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొండాపూర్‌కు చెందిన కందుల రమణారెడ్డి, గోపాల్‌రావుపేటకు చెందిన ఏడెల్లి పర్శరాములుతోపాటు పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరగా వారికి ఆయన గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామిని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని మరిచిన రేవంత్ కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై త్వరలో సదస్సు నిర్వహించి నిజానిజాలు ప్రజలకు వివరించనున్నట్టు తెలిపారు. గతంలో ఆంజనేయస్వామి ఆలయానికి 5.30 ఎకరాలుండగా, బీఆర్ఎస్ హయాంలో 333 ఎకరాల రెవెన్యూ భూమిని దేవాదాయశాఖకు బదిలీచేసి విస్తరించినట్టు తెలిపారు. ప్రతి ఏటా రెండు హనుమాన్ జయంతులను నిర్వహించే ఏకైక ఆలయం కొండగట్టు అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కొండపైన నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సంతలోనిలొద్దిని ప్రత్యేక రిజార్వాయర్గా మార్చి కొండపైకి తీసుకొచ్చేందుకు పనులను ప్రారంభించామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నిధులు కుదించడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే సత్యం కొండగట్టు ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ హయాంలో రూ.1000 కోట్లు ప్రకటించి, రూ.500 కోట్లకు ప్రణాళికలు రూపొందించామని గుర్తుచేశారు.