కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 31: ‘ప్రభుత్వ శాఖలో రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పింది. ప్రచారంలో ఇదే ప్రధానాస్త్రంగా లేవనెత్తింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా? సదరు పోస్టులు ఏయే ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయో? విభాగాల వారీగా బహిరంగపరచాలి’ అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి చివరి నాటికి ఆ కొలువులను గుర్తించి మొత్తం రెండు లక్షల లెక్క యువతకు చెప్పాలని సవాల్ చేశా రు. బుధవారం కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన నర్సింగ్ స్టాఫ్‌కు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి అట్టహాసంగా ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడాన్ని తాము సంతోషిస్తున్నామని, అయితే ఈ ఉద్యోగాల ప్రక్రియను పూర్తి చేసింది కేసీఆర్ పాలనలోనేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఉద్యోగ పత్రాలు అందించి ఉంటే ఇంకా ఎక్కువ సంతోషించే వారమని పేర్కొన్నారు. ఈ నర్సింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి గత డిసెంబర్లోనే అప్పటి మంత్రి హరీశ్‌రావు ఏడు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించిందని, కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలు, ఉద్యోగాల భర్తీ నిలిచి పోయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 2023 అక్టోబర్ 16 నాటికి రాష్ట్రంలో 1,60,083 ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ, పోలీస్, రెసిడెన్షియల్, హెల్త్, యూనివర్సిటీలు తదితర విభాగాల్లో భర్తీ చేసినట్టు చెప్పారు. మరో 42,652 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు కూడా పూర్తి చేసినట్టు గుర్తుచేశారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు తెలిపారు.