కరీంనగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం జలాలను ఎత్తిపోసి, ఎస్సారెస్పీకి పునర్జీవం పోసి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరందించి బీఆర్ఎస్ సర్కారు రికార్డులు నెలకొల్పితే.. నేడు అదే కాళేశ్వరంపై కక్ష గట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కారు రైతులను పరేషాన్ చేస్తున్నది. ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు.. మధ్యమానేరు నుంచి కొండపోచమ్మ వరకు ప్రాజెక్టులు వెలవెలబోతుండటంతో సాగునీటి రంగానికి చుక్కనీరు ఇవ్వలేని దుస్థితి నెలకొన్నది. కాళేశ్వరంపై కక్ష సాధింపు ధోరణి, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని దాదాపు 14 లక్షల ఎకరాల ఆయకట్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే నార్లు ఎండిపోయి, అన్నదాత మొగులకు మొఖం చూడాల్సిన దుస్థితి నెలకొన్నది.
అనతికాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని అన్నారం-సుందిళ్ల-ఎల్లంపల్లి-శ్రీరాజరాజేశ్వర జలాయం, లోయర్‌మానేరు డ్యాం-అన్నపూర్ణ జలాశయం వరకు.. అక్కడినుంచి కొండపోచమ్మ-ఎగువమానేరు వరకు ఎత్తిపోసిన ఘనత కేసీఆర్ సర్కారుకు దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీటి రంగానికి ఏటా రెండుసార్లు ఉపయోగపడేది. ఉత్తర తెలంగాణలో వర్షాలు ఆలస్యంగా వస్తాయి. దీంతో బీఆర్ఎస్ సర్కార్ ముందుగా లక్ష్మీబరాజ్ నుంచి వెళ్లే గోదావరి నీటిని ఒడిసిపట్టి కన్నెపల్లి పంపుహౌస్ ద్వారా ఎత్తిపోసి.. నార్లు వేసుకోవడానికి నీళ్లు ఇచ్చేది. జూలై మొదటి, రెండో వారంలో నార్లు వేసుకోవడానికి వీలుగా కాళేశ్వరం జలాలను అందించింది. తిరిగి సీజన్ చివరి దశలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు మరోసారి ఎత్తిపోతలు చేపట్టడమే కాకుండా మధ్యమధ్యలో సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటిని ఎత్తిపోసి అన్నదాతలకు భరోసానిచ్చింది. ఫలితంగా ఎస్సారెస్పీ చరిత్రలో ఎన్నడూలేని అనేక రికార్డులను బీఆర్ఎస్ సర్కారు లిఖించింది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూస్తే.. కాళేశ్వరం జలాలను దిగువమానేరు జలాశయానికి తరలించి, ఈ ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టకు నీరందించేందుకు 6,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన రికార్డు నెలకొల్పొంది. దిగువమానేరు చరిత్రలో ఏనాడూలేనివిధంగా 2022 యాసంగి సీజన్లో 52 టీఎంసీల నీటిని దిగువకు వదలిపెట్టి మరో రికార్డు సృష్టించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ నెలన్నర రోజులపాటు వరుసగా దిగవన ఉన్న కాకతీయ కాలువకు నీటిని విడుదలచేసిన దాఖలాలు లేవు. కానీ, బీఆర్ఎస్ సర్కారు వరుసగా 146 రోజులపాటు నీటిని విడుదల చేసింది. ఎస్సారెస్పీ స్టేజీ-2 పరిధిలో ఉన్న 767 చెరువులను నింపడంతోపాటు సూర్యాపేట జిల్లా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రికార్డు నమోదుచేసింది. ఎస్పారెస్పీ చరిత్రలో స్టేజీ-2 పరిధిలోని ఆయకట్టుకు ఉమ్మడి పాలనలో ఒకటి రెండు టీంఎసీలు కూడా వెళ్లలేదు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం పలు సీజన్లలో దాదాపు 24 టీఎంసీలకుపైగా నీటిని అందించింది. 2022లో వానకాలం, యాసంగి కలిపి ఏకంగా 24,30,753 లక్షల ఎకరాలు సాగు చేయడం ఎస్సారెస్పీ చరిత్రలోనే రికార్డు. అందుకు కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. 2019లో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి గోదావరి జలాలను పరిపూర్ణంగా వినియోగించుకునే అవకాశం కల్పించిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కింది. కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువ ద్వారా ఎగువకు నీటిని పంపించడం, మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాలకు నీటిని ఎత్తిపోసి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టును అంటే ఒక సీజన్లో దాదాపు 14 లక్షల ఎకరాలకుపైగా సాగులోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కింది.
ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు, శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి కొండపోచమ్మ, ఎగువమానేరు వరకు ప్రస్తుతం ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. ఎస్సార్పెస్పీ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 21 టీఎంసీలు నిల్వ ఉన్నది. అందులో 5 టీఎంసీల డెడ్‌స్టోరీజీ, మిషన్‌భగీరథ అవసరాలు, నీటి ఆవిరి నష్టాలను తీసేస్తే.. నాలుగు నుంచి ఐదు టీఎంసీలు మాత్రమే సాగునీరు అందించడానికి ఆస్కా రం ఉన్నది. ఒకవేళ వర్షాలు పడకపోతే.. ఉన్న నీరు ఇతర అసరాలకు కూడా సరిపోదని అధికారులు చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో వాటర్‌హబ్‌గా మారిన శ్రీరాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు ప్రాజెక్టు) ప్రస్తుతం బోసిపోయింది. ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6 టీంఎసీల నీరు మాత్రమే ఉన్నది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోతే దిగువ ఎస్సారెస్పీ ఆయకట్టుతోపాటు కొండపోచమ్మసాగర్, ఎగువమానేరు పరిధిలోని ఆయకట్టు అంతా ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే దిగువమానేరులో నీరు అడుగంటిపోయింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీలు కాగా, ఆరు టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది. డెడ్‌స్టోరేజీ పోతే ఇక్కడ మిషన్‌భగీరథకు కూడా నీరు ఇవ్వడమే కష్టం. ఈ ప్రాజెక్టును నింపకపోతే ఎస్సారెస్పీ దిగువ ఆయకట్టుకు చుక్కనీరు ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారనున్నది. ఎగువమానేరు ప్రాజెక్టు సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.63 టీఎంసీలున్నాయి. మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల జిల్లాపై పెనుప్రభావం పడే ప్రమాదమున్నది. అన్నపూర్ణ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీంఎసీలుకాగా ప్రస్తు తం 1.22 టీఎంసీల నీరున్నది. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో అన్నపూర్ణకు మధ్యమానేరు నుంచి నీరు వెళ్లడం లేదు. దీంతో కొండపోచమ్మసాగర్‌కు నీటిని పంపేందుకు అవకాశం లేకుండా పోయింది. బీఆర్ఎస్ హయాంలో నిండుకుండలా ఎల్లంపల్లి ఈప్రాజెక్టు ప్రస్తుతం వెలవెలబోతున్నది.
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు రెడ్డబోయిన మొగిలి. హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామంలో డీబీఏం కాకతీయ ఉపకాలువ పక్కనే నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో వరి వేస్తున్నాడు. కాకతీయ కాలువ నీళ్ల మీదనే ఆధారపడి సాగు చేస్తుంటాడు. ఇరువై రోజుల క్రితం బావి నీళ్లతో మొలక చేశాడు. ప్రస్తుతం ఆ బావి ఎండిపోవడంతో నారుమడి ఎండుముఖం పట్టింది. ఎప్పుడూ ఇలా జరగలేదని, ఈపాటికే కాలువ నీళ్లు వచ్చేవని, నాటు పడేదని మొగిలి చెప్పాడు.
రోహిణి కార్తెలో మొలక అలుకుడు చేసిన. ఇప్పుడు నారు ముదిరిపోయింది. కాకతీయ కాలువ నీళ్లు ఇప్పుడప్పుడే వచ్చే సూచనలు లేవు. అందుకే మళ్లీ అలుకుడు చేస్తున్న. ఎప్పుడూ గిట్ల కాలం కాకుండా ఉండలేదు. కాలువ నీళ్ల మీదనే ఆధారపడి వరి సాగు చేస్త. నాకు ఐదు ఎకరాలున్నది. ఇంతవరకు ఐదు గుం టలు కూడా నాటు వేయలేదు.
25 రోజుల క్రితం మొలక అలుకుడు చేసిన. మరో వారం రోజుల్లో వర్షాలు పడకపోయినా, కాకతీయ కాలువ నీళ్లు రాకపోయినా ఇబ్బంది అయితది. నారు ముదిరిపోతే ఎటుకాకుండా ఉంటుంది. కాలువ నీళ్లు వస్తాయని ధీమాతోనే ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్న. నీళ్లు రాకుంటే పెట్టుబడి మీద పడుతుంది. కాళేశ్వరం నీళ్లు ఉన్నప్పుడు పుష్కలంగా నీళ్లు వచ్చేవి.