హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): తొలి విడత పంచాయతీ పోరులోనే (Panchayathi Elections) కమలం (BJP) వాడిపోయింది. ఇతరులు గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలువలేక చతికిలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆ పార్టీకి 8మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలు ఉన్నా రు. మాట్లాడితే తామే ప్రత్యామ్నాయం అంటూ ప్రగల్భాలు పలికినా, అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోవడం, తాజా పంచాయతీ మొద టి విడత ఫలితాలు కూడా అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.
తొలి విడతలో 4,236 స్థానాల్లో కేవలం 189 స్థానాల్లో (4.4శాతం)నే బీజేపీ బలపరచిన అభ్యర్థులు నెగ్గడంతో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. అందులోనూ 7 ఏకగ్రీవం కాగా ప్రత్యక్ష బరిలో నిలిచి గెలిచినవి 182. ఆ కొద్ది స్థానాలు కూడా రెండు జిల్లాలవే. మిగతా జిల్లాల్లో ఎక్కడా రెండంకెల స్థానాలను బీజేపీ బలపరచిన అభ్యర్థులు దాటలేదు. కేంద్ర సహాయ మం త్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రా జేందర్ ఉన్నా కూడా కరీంనగర్లో 13 మాత్రమే నెగ్గడం పంచాయతీ పోరులో కమలం అధ్వాన ఫలితాలకు దర్పణం పడుతున్నది.