హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్లపై విషయంలో కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి చేతులెత్తేశారు. కేంద్రం క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా తానేం చేయలేనని వ్యాఖ్యానించడం గమనార్హం. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో జరిపిన చిట్‌చాట్‌లో కిషన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కేంద్ర మంత్రినైనంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేనేం చేయగలను’ సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా రాష్ట్రపతి కూడా ఏమీ చేయలేరు. మహారాష్ట్రలో మా ప్రభుత్వమే ఉన్నా ఏమీ చేయలేకపోయాం’ అని తెలిపారు.
మహారాష్ట్రలో ఎన్నికలైన తర్వాత బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని చెప్పారు. దీంతో కేంద్ర మంత్రి హోదాలో రాష్ర్టానికి ఏమీ చేయలేదన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నట్టేనని బీసీ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రాష్ర్టానికి కీలక ప్రాజెక్టులను సాధించడంలో కిషన్‌రెడ్డి విఫలమయ్యారని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలను ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల విషయంలో ‘కేంద్ర మంత్రినైంత మాత్రాన నేనేం చేయగలను’ అంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సర్కారే విఫలం
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించింది కాంగ్రెసేనని కిషన్‌రెడ్డి విమర్శించారు. దానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, తాజాగా హైకోర్టులో వాదనలు వినిపించడంలోనూ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. బీసీలకు 42 శాతం కోటాపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థి కోసం మూడు పేర్లను అధిష్ఠానానికి ప్రతిపాదించామని, పార్లమెంటరీ బోర్డ్ మీటింగ్ తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు.