హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఫ్యూచర్‌సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారని, విద్య, వైద్యం, అభివృద్ధి.. ఇలా అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారును ప్రజలే భూస్థాపితం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 7న ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించే మహాధర్నా సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేంద్రం ఏ సిటీకీ నిధులు ఆపలేదని, ఫ్యూచర్‌సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. మరోవైపు, మహాధర్నాకు 8 జిల్లాల నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మహాధర్నా తర్వాత హిల్ట్ పాలసీపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలిసింది.