హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ఎన్నికలకు ముందు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన పార్టీ.. ఆ హామీలను అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ అరకొరగా చేశారని, ఇప్పుడు రైతు భరోసాకు కొర్రీలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద రైతుల వివరాలన్నీ ఉన్నా దరఖాస్తుల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు అనేక హామీలిచ్చి, ఇప్పుడు అమలు చేయడం లేదని ఆరోపించారు.
రైతు భరోసా కింద రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం, రైతు కూలీలకు రూ.12 వేల సాయం, వరితోపాటు సుమారు 10 రకాల పంటలపై రూ.500 బోనస్, పత్తి, మొకజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలకూ ఇస్తామన్న బోనస్ హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ‘మార్పు’ పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఏడాదిగా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని, కాంగ్రెస్ నేతల్లో మాత్రం వచ్చిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ది ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని మండిపడ్డారు. నిరుడు నవంబరు 30న పాలమూరులో సీఎం రేవంత్ ఇచ్చిన చెక్కులకు ఇప్పటివరకూ డబ్బులు పడలేదని ధ్వజమెత్తారు.