KTR | తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. కచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ వేపే నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మొదలుకొని పంచాయతీ సర్పంచ్ల వరకు ప్రతి ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపే ప్రజలు నిలబడ్డారని పేర్కొన్నారు.
ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులతో పురపాలక ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ రెండు జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన మున్సిపల్ ఎన్నికల వ్యూహాన్ని, ఇతర అంశాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమేనని అన్నారు. ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులు కేవలం ద్విధృవంగా మారడం, ఎన్నడూ లేని ఒక విభిన్నమైన పరిస్థితి ఏర్పడటం వల్ల బీజేపీ గెలిచిందే తప్ప.. గతంలో కానీ.. భవిష్యత్తులో కానీ బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలం లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేత ఘోరమైన ఓటమిని చవిచూశారని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ కాబోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపై, అవినీతిపై, అక్రమాలపై 24 నెలలుగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమని తెలిపారు.
మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చేసిన అధికార దుర్వినియోగం, చెప్పిన తప్పుడు లెక్కలు అన్నీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నప్పటికీ.. కృష్ణా జలాల నుంచి మొదలుకొని అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా.. బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ రెండు జాతీయ పార్టీలను, వారి తెలంగాణ వ్యతిరేక ఎజెండాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ రెండు పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
పురపాలక ఎన్నికల్లో సమిష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్‌పై ఘనమైన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని ఆదిలాబాద్, మెదక్ జిల్లా నాయకులకు కేటీఆర్ ఈ సందర్భంగా సూచించారు. ఇందుకోసం ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యాలను, హామీల అమలు మోసాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో పాటు పార్టీ సీనియర్ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈ సమావేశంలో పాల్గొని అనేక అంశాల పైన పార్టీ శ్రేణులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇప్పటికి బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో దాదాపుగా పడిపోయిందని, రానున్న ఎన్నికల్లో పోటీ ముమ్మాటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఉంటుందని పార్టీ నేతలు క్షేత్రస్థాయిలోని పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు తెలియజేశారు.