హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) :
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టి పేదల ఇండ్లను కూలుస్తుంటే బీజేపీ ధర్నాలు చేసింది.. కానీ ఆ పార్టీ ఎంపీ మాత్రం హైడ్రాకు సంపూర్ణ మద్దతు పలికారు. రేవంత్ చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతి ఒకరూ తప్పుబట్టారు. కిషన్‌రెడ్డి సహా బీజేపీ నేతలు మూసీ నిద్ర సైతం చేపట్టారు. కానీ అదే పార్టీకి చెందిన ఓ ఎంపీ మాత్రం కూల్చివేతలు సబబేనని కితాబిచ్చారు. హెచ్‌సీయూ భూముల విషయంలోనూ అంతే. అందరూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తి పోస్తుంటే.. ఆ ఎంపీ మాత్రం బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తూ వచ్చారు.
ఎందుకిలా? పదే పదే ప్రభుత్వ పల్లకీని మోయాల్సిన అవసరం ఆ బీజేపీ ఎంపీకేంది? సర్కారు ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి మీడియా ముందుకు వచ్చి.. ఇష్యూ డైవర్షన్ కోసం ఆరాటపడటమెందుకు? తాజా సంచలన విషయాలనూ చిన్నదిగా కొట్టిపారేస్తూ.. గత ప్రభుత్వంపై పనిగట్టుకొని బురదచల్లేందుకు తాపత్రయమెందుకు? తన పార్టీ వైఖరికి భిన్నమైనా సరే.. కాంగ్రెస్ కోసం సొంత స్టాండ్ ఎందుకు తీసుకుంటున్నట్టు? రేవంత్ సర్కారుకు తనవంతు సాయం అందించేంత బంధమేమిటి? ఇప్పుడు బీజేపీతోపాటు రాజకీయ పక్షాల్లో ప్రముఖంగా జరుగుతున్న చర్చ ఇది. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించాల్సిందిపోయి.. ప్రధాన ప్రతిపక్షంపై నోరుపారేసుకోవడం సదరు పార్లమెంటు సభ్యుడికి అలవాటుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్‌రెడ్డిపై ఈగవాలనీయకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ సీనియర్ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తమది ప్రతిపక్ష పార్టీ అని మరిచిపోయినట్టు వ్యవహరించడం, అవసరం లేకున్నా అధికారపక్షానికి అంటకాగడంపై వారు మండిపడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా ఎంపీ వ్యవహారశైలి.. ఏ ఏ సందర్భాల్లో ఆయన ఎలా పార్టీ వైఖరికి భిన్నంగా కాంగ్రెస్‌కు మద్దతు నిలిచిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
సీఎం రేవంత్ గతేడాది హైడ్రాను ప్రవేశపెట్టినప్పుడు, మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇండ్లను కూల్చడం మొదలుపెట్టినప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పెద్ద పెద్ద సౌధాలను వదిలి, బడుగుల గుడిసెల మీదికి బుల్డోజర్ను తోలడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బీఆర్ఎస్ మొదటిరోజు నుంచే బాధితుల పక్షాన నిలిచింది. ప్రభుత్వ తీరును అడుగడుగునా తప్పుపడుతూ వచ్చింది. మొదట్లో ఈ బుల్డోజర్ రాజ్‌పై తమకేమీ పట్టనట్టు వ్యవహరించిన బీజేపీ.. ప్రజా వ్యతిరేకతను గమనించి కూల్చివేతలను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ‘రాజధాని పరిధిలో ప్రభుత్వం విచ్చలవిడిగా కూల్చివేతలు చేపడుతుంటే.. నలుగురు ఎంపీలు, 40 మంది కార్పొరేటర్లు ఉండీ ఏం లాభం?’ అంటూ విమర్శలు వెల్లువెత్తడంతో అనివార్యమైన స్థితిలో బీజేపీ నేతలు బయటకురావాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నాలూ చేపట్టారు. ‘అవసరమైతే లక్షలమందితో సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. హైడ్రా విషయంలో హైకోర్టుకు వెళ్తాం’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రకటనలు సైతం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూల్చివేతలకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన మొదటి వ్యక్తి సదరు బీజేపీ ఎంపీ! ‘నీళ్లల్లో కట్టిన ఇండ్లను కూల్చాల్సిందే. ఆ ఇండ్లకు పర్మిషన్లు ఉన్నా, బ్యాంకులోన్లు ఉన్నా కూల్చివేయాల్సిందే. అలా కూల్చటం చేతకాకపోతే హైడ్రా కమిషనర్ పకకు తప్పుకుంటే మంచిది’ అని బాహాటంగానే ఆయన వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. కూల్చివేతలకు ఎవరైనా అడ్డొస్తే వారిపైకి బుల్డోజర్లు ఎకించాలని, హైడ్రాను జిల్లాలకూ విస్తరించాలని ఆ ఎంపీ సూచించిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. చేయాల్సిన నిరసనలను వదిలి.. సదరు ఎంపీ గారి వ్యాఖ్యలపై సర్దిచెప్పుకోవడమే పార్టీకి శిరోభారంగా మారిందని బీజేపీ సీనియర్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వా న్ని నిలదీయాల్సింది పోయి.. ఆ పార్లమెంటు సభ్యుడు బీఆర్ఎస్పై విమర్శలు చేస్తుండటం మీద రాష్ట్ర బీజేపీలో చర్చ జరుగుతున్నది. దీనికి హెచ్‌సీయూ ఘటనలోనూ ఆయన వైఖరి అనుమానాస్పదంగా ఉన్నదనే దానిపైనా నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 400 ఎకరాల్లో అటవీ భూమిని ధ్వంసం చే సేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. బాధ్యతగల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అ డ్డుకున్నది. కంచ గచ్చిబౌలిలో ప్రభు త్వం జరిపిన అరాచకం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సమయంలో అధికార కాంగ్రెస్‌ను ప్రశ్నించాల్సిన ఎంపీ.. కేసీఆర్, కేటీఆర్‌పై అసంబద్ధ ఆరోపణలకు దిగడంపై బీజేపీ వర్గాలు అసహసనం వ్యక్తంచేస్తున్నాయి. నిత్యం గత ప్రభుత్వంపైనే ఆరోపణలు చేయడంలో అంతరార్థమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదనే భావన ప్రజల్లో బలపడుతున్నదని వాపోతున్నారు. ఆయన ధోరణి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నదని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.