హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత మృతికి కారణమైన నగరంలోని బోరబండ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వ్యవహారంలో ఎంపీ రఘునందన్ చేసిన వ్యాఖ్యలు విస్మయానికి గురిచేశాయి. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఎంపీ రఘునందన్‌రావు సమావేశానికి హాజరయ్యారు.
బాబా ఫసీయుద్దీన్‌ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు సభలో డిమాండ్ చేశారు. జోక్యం చేసుకున్న ఎంపీ రఘునందన్‌రావు బాబా ఫసీయుద్దీన్‌కు మద్దతుగా మాట్లాడిన తీరు కాంగ్రెస్-బీజేపీ బంధాన్ని మరోసారి బయటపెట్టిందన్న చర్చ మొదలైంది. కౌన్సిల్లో తానొక ఎంపీగా, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశాలకు హాజరయ్యాననే విషయాన్ని మరిచిన రఘునందన్‌రావు ఫసీయుద్దీన్‌కు న్యాయవాదిలా వ్యవహరించారు.
కాంగ్రెస్‌కు మద్దతుగా తమ ఎంపీ మాట్లాడటం విస్మయం కలిగించిందని స్వ యంగా బీజేపీ కార్పొరేటర్ చెప్పడం గమనార్హం. బాబా ఫసీయుద్దీన్ లంచాల వేధింపులు తట్టుకోలే బీఆర్ఎస్ డివిజన్ మైనార్టీ నాయకుడు సర్దార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడంటూ మేయర్ విజయలక్ష్మిని బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. మేయర్ బదులిస్తూ బాబా వస్తాడని, చైర్‌పై నోరు పెంచొద్దని అన్నారు. ఆత్మహత్య బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో తనను బెదిరించవద్దని, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.
ఫసీయుద్దీన్ విషయమై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడతారని విజయలక్ష్మి చెప్పారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆయనను మాట్లాడనివ్వాలని సభ్యులకు సూచించారు. ఆ వెంటనే రఘునందన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆరోపణల నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఇంకా అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు.
కార్పొరేటర్‌ను ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తే పార్టీలకు అతీతంగా ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ చేయడంలో అర్థం ఉంటుందన్నారు. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన ఉరి తీయాల్సిన అవసరం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుర్తుచేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి పోలీసులు దర్యాప్తు చేస్తారని, మీ వద్ద ఆధారాలు ఉంటే సమర్పించాలని ఓ న్యాయవాదిగా సూచిస్తున్నట్టు తెలిపారు. తన లాంటి న్యాయవాదిని వెంట తీసుకెళ్లాలని రఘునందనరావు పేర్కొన్నారు.