హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సీఎం రేవంత్రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ప్రజాస్వామికంగా ఎన్నికల పద్ధతిలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. అయితే సీఎం రేవంత్రెడ్డి అభద్రతాభావంలో ఉండి.. తమ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోసేందుకు ప్రయత్నిస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు పలికేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సీఎం పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారని, పూర్తి మెజార్టీ ఉన్నా ప్రభుత్వం కూలిపోతుందనే అనుమానం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్సభ ఎన్నికలు రెఫరెండం అని.. రాష్ట్రంలో 14 సీట్లు గెలుస్తామని.. సీఎం పదేపదే చెప్తున్నారని, ఒకవేళ మాట నిలబెట్టుకోకపోతే రేవంత్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.