మేడ్చల్, మే 12: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఓ సైకో, శాడిస్టు అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టబడి ఉన్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. సోమవారం ఆయన మేడ్చల్లోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన తుగ్లక్ పాలనలా ఉన్నదని విమర్శించారు. రెక్కలు ముక్కలు చేసుకొని నిర్మించుకున్న ఇండ్లను కూల్చొద్దని కోరితే, ఎవరి మాటా వి నను, అనుకున్నదే చేస్తాననేవారిని సైకో కాకపోతే ఏమని అనాలని ప్రశ్నించారు.
కూకట్పల్లిలో నల్లచెరువు వద్ద నిర్మించుకున్న ఇండ్లను కూల్చుతారన్న భయంతో బుచ్చమ్మ అనే వృద్ధురాలు చనిపోయిందని, ఇంతటి దా రుణాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం లేదని, పరిపాలన మీద రేవంత్రెడ్డి పూర్తిగా పట్టుకోల్పోయారని విమర్శించారు. విదేశీ పర్యటనల్లో ఉన్న సీఎం అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారని వ్యాఖ్యానించారని, ఆ వీడియోను బయటపెడుతామని పేర్కొన్నారు.
ఈటల ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నం
సీఎం రేవంత్రెడ్డి పరిపాలనా తీరును విమర్శిస్తూ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ సోమవారం ఈటల ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో మేడ్చల్ మున్సిపాలిటీ పూడూరు పరిధిలో ఉన్న ఈటల రాజేందర్ నివాసం వద్ద సోమవారం ఉదయం నుంచే పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.