Etala Rajender | హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొంది రెండేండ్లు అవుతున్నప్పటికీ కూడా, వారు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డినే కారణమని ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కారులో కూర్చోబెట్టి, రిటైర్మెంట్ డబ్బుల చెక్కును ఇచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో రెండేళ్లు అయినా, ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు అని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
కొద్ది మంది కమీషన్లు ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తెచ్చుకుంటున్నరు. కొద్ది మందేమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నరు. ఆ దుస్థితి ఏర్పడింది ఇవాళ. ఏమన్న అంటే రాష్ట్రం దివాళా తీసింది అని ప్రభుత్వం అంటుంది. నీవు అధికారంలోకి వచ్చినప్పుడు తెల్వదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అనేక వేదికలపై మాట్లాడారు కదా..? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలవకుండానే హామీలు ఇచ్చారా..? ఆరు గ్యారెంటీలు గురించి ఇవాళ ఎవరు మాట్లాడతలేరు. హామీల గురించి ఎవరు మాట్లాడుతలేరు. మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడుతలేరు. ఉన్నవాటిని అమలు చేయండని ప్రజలు అంటున్నరు. ఉన్న పెన్షన్లు సమయానికి ఇవ్వండి దండం పెడుతం అంటున్నరు. ఇది రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు.