MP Arvind | నిజామాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది సాక్షిగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అహ్మద్పుర కాలనీలోని నేషనల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎంపీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. మైనార్టీ ప్రాంతాల్లో దొంగ ఓట్లు వేస్తున్నారని ఆరోపిస్తూ పలుచోట్ల పర్యటించిన అర్వింద్.. సున్నితమైన ప్రాంతంలో పకడ్బందీ పోలీస్ బందోబస్తు నిర్వహించినప్పటికీ తన అనుచరగణంతో పోలింగ్ కేంద్రం ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లారు. ముస్లిం ఆచారం ప్రకారం హిజాబ్ ధరించి వచ్చిన మహిళా ఓటర్లను చూసిన అర్వింద్.. వారిని మీరు ఎలా గుర్తు పడుతున్నారు? వారి ముఖానికి ఉన్న బుర్ఖాను తొలగించి చూడాలని ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లో మహిళా సిబ్బంది అని కూడా చూడకుండా ఎంపీ ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరును కొందరు వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు, పోలీసులపైనా అర్వింద్ చిందులు వేశారు. ఇదే పోలింగ్ స్టేషన్ వద్ద ఓటు వేసిన తర్వాత పలువురు వ్యక్తులు గుమిగూడుతున్నారని, వారిని ఎందుకు అనుమతి ఇస్తున్నారని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డిని నిలదీశారు. చెంచాగిరి చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సార్.. ఇక్కడి నుంచి వెళ్లండి.. దయచేసి సహకరించండి.. అని సదరు పోలీస్ అధికారి సంయమనంతో కోరినా నన్ను వెళ్లమనేందుకు నువ్వు ఎవడివి? అంటూ ఏకవచనంతో సంబోధించారు. తనతో జాగ్రత్తగా ఉండాలని మీ కెరీర్‌ను స్పాయిల్ చేసుకోవద్దని అర్వింద్ ఏసీపీని హెచ్చరించారు. ఇక్కడేమీ మార్కెట్ నడుస్తున్నదా? అంటూ పోలింగ్ బూత్ వద్ద పోగైన వారిని ఎంపీ అరవడంపైనా స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.