హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి గ్రాఫ్ డౌన్ అయిందని బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తున్నదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మోదీని తిడుతుంటే, మంత్రులు మాత్రం సబర్మతి రివర్ ఫ్రంట్ చూసేందుకు 150 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మేయర్‌ను తీసుకెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అసత్య ప్రభుత్వం నడుస్తున్నదని మండిపడ్డారు. హామీలు మరిచి హెచ్‌సీయూ, మూసీ, హైడ్రా, సినిమా వాళ్లపై పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపడం రేవంత్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.