Bandi Sanjay | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించిన తర్వాత పార్టీలో గొడవలు, గ్రూపు రాజకీయాలు ఆగిపోయాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బండికి వ్యక్తిగతంగా క్రేజ్ ఏమీ లేదని, అదంతా బీజేపీదేనని పేర్కొన్నారు. తాజాగా ఆయన ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డికి ఉన్న చాకచక్యం, కో ఆర్డినేషన్ పవర్ బండికి లేదని పేర్కొన్నారు.
బండి సంజయ్‌ని ఢిల్లీ పెద్దలు వేరే రాష్ర్టానికి పంపిస్తారని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో మండల అధ్యక్షుల మార్పుతో జరిగిన తిరుగుబాటును చిన్న విషయంగా కొట్టిపారేశారు. బండిపై పార్టీకి అర్వింద్ ఫిర్యాదులు చేసేవాడని చెప్పుకుంటున్నారు. కిషన్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా ‘ఇప్పటికైనా ఢిల్లీలో ఫిర్యాదులు చేయడం ఆపండి’ అని బండి చేసిన వ్యాఖ్యలు ఈటల, అర్వింద్‌ను ఉద్దేశించినవే అని చెప్తున్నారు. మరోవైపు బండి సంజయ్‌ని అర్వింద్ మొదటి నుంచీ కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ బండి అనుచరులు మండిపడుతున్నారు.