హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : పురపోరులో బీజేపీ ఎమ్మెల్యేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారి నియోజకవర్గాల పరిధిలోని ఏ ఒక్క మున్సిపాలిటీలో విజయం సాధించలేదు. రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అని ఊదరగొడుతున్న బీజేపీ నాయకులను జనం పట్టించుకోలేదు. శాసనసభ బీజేపీ పక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సొంత నియోజకర్గంలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. నిర్మల్ మున్సిపాలిటీలో మొత్తం 42 స్థానాల్లో బీజేపీ కేవలం 13 స్థానాల్లోనే గెలుపొందగా, కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయం సాధించింది.
ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డికి ఝలక్ ఇచ్చారు. 36 స్థానాల్లో బీజేపీ కేవలం 8 స్థానాల్లోనే గెలుపొందింది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు సైతం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 స్థానాలకుగాను బీజేపీ 5 స్థానాల్లోనే గెలిచింది. కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఎదురుగాలి తగిలింది. మొత్తం 49 స్థానాలున్న ఈ మున్సిపాలిటీలో బీజేపీ కేవలం 16 స్థానాలకే పరిమితమైంది. ఇక్కడ బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలుపొందింది.
ముథోల్ నియోజకవర్గ పరిధిలోని భైంసా మున్సిపాలిటీలోని 26 స్థానాల్లో బీజేపీ కేవలం 6 స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఫలితాలే బీజేపీని ప్రజలు విశ్వసించడం లేదనేందుకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీలకు సైతం నిరాశ ఎదురైంది. కరీంనగర్, నిజామాబాద్ మినహా ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని బల్దియాల్లో ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీలలో ఆ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.