హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలుకు నిబంధనలనే కొర్రీలు పెడుతున్నదని బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు వారితో నిత్యం యుద్ధం చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గురువారం నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో ఎకరానికి రూ.15వేలు ఇస్తామని చెప్పిందని, కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చినట్టు రూ.5వేలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మ్యానిఫెస్టోలో 5, 10 ఎకరాల లోపువారికి, అర్హులకు మాత్రమే రైతుబంధు ఇస్తామని ప్రకటించలేదు కదా అని నిలదీశారు. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. మొదట దానిని అంబేద్కర్ భవన్ అన్నారని, ఆ తర్వాత దానిని ఫిర్యాదుల భవన్‌గా మార్చారని, మళ్లీ దానిని ఎస్సీ, ఎస్టీల స్టడీ సెంటర్‌గా, ఐఏఎస్ ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చుతామని చెప్పారని, ఇప్పుడు డిప్యూటీ సీఎంకు కేటాయించడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు.
రూ.5 వేలు గత ప్రభుత్వమే ఇచ్చింది కదా..!
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రూ.5 వేల రైతుబంధు ఇస్తా ఎలా? అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా రూ. 5 వేలు ఇచ్చింది కదా అని నిలదీశారు. రైతులకు ఒకేసారి రైతుబంధు ఇవ్వాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారని, రెండు లక్షల రుణమాఫీని ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఆ గ్యారెంటీలు అమలు చేసేందుకు వేల కోట్ల రూపాయలు కావాలని, అంత డబ్బును వారు ఇంటి నుంచి తీసుకొస్తారో? లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి తీసుకొస్తారో? అని వ్యాఖ్యానించారు. మీడియా పాయింట్ వద్ద ఇంకా బీజేపీ ఎమ్మెల్యేలు కే వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పటేల్, పైడి రాకేశ్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు.