మెట్పల్లి, ఫిబ్రవరి 12: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో అధికారపార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్ చేస్తూ కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. సానుకూల స్పందన లేకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి పట్టణాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దిగజారిన రాజకీయాల తీరుపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు.
తమ పార్టీ అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే అదనపు భద్రత కల్పించాలని కోరుతూ గురువారం ఎస్పీ అశోక్‌కుమార్‌ను కలిసి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం పోలీస్‌శాఖ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఇచ్చే తీర్పును గౌరవించాల్సిన కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమన్నారు. ప్రజాతీర్పును వక్రీకరించే ప్రయత్నాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు.