ఆదిలాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు.. బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇండ్లను ముట్టడించడానికి భారీగా తరలివెళ్లారు. నేతల ఇండ్ల వద్ద బారికేడ్లు అడ్డంగా పెట్టగా వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్లారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. పోలీసులు రామన్నతోపాటు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటి ముట్టడిలో తలమడుగు మండలం రుయ్యాడికి చెందిన అశోక్ తోపులాటలో కింద పడడంతో చేయి విరిగింది. పోలీసుల తీరును జోగు రామన్న స్టేషన్ ఎదుట బైఠాయించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీగా నిరసన తెలిపితే పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని విమర్శించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రంగు మారిన సోయాను, తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. షాపుల్లో యూరియా లేనప్పుడు యాప్‌లు పెట్టి ఏం లాభమని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి, రంగు మారిన సోయా కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.