Revanth Reddy | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డి ఐపీఎస్ ఆఫీసరేం కాదు.. మంత్రులంతా కానిస్టేబుళ్లు.. హోంగార్డులు కాదు. ప్రభుత్వంలో అనేకమంది సీనియర్ మంత్రులున్నారు.. వారి సూచనలు, సలహాలు తీసుకోవాలి’ అని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై శనివారం ఆయన మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డికి పాలనా అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన దూకుడు తగ్గించుకొని సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ రాష్ర్టాన్ని కాపాడాలని కోరారు. గతంలో సీఎం అభ్యర్థి ఎప్పుడూ ఓడిపోలేదని.. ఒక స్థానంలో ఓడిపోయినా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల గురించి తప్ప మిగిలిన 412 హామీల గురించి మాట్లాడటం లేదని మండిపడ్డారు.
420 హామీలకు 8 హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయని, ఇన్ని హామీలిచ్చినా కాంగ్రెస్‌కు ప్రజలు బొటాబొటి మెజార్టీనే ఇచ్చారని, ఆరు గ్యారెంటీల గురించే పదేపదే మాట్లాడటం సరికాదని అన్నారు. ప్రజావాణి.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కావాలే తప్ప.. పబ్లిసిటీ షో కాకూడదని సూచించారు. ప్రతిరోజూ ప్రజాదర్బార్ ఉంటుందని చెప్పి.. ఇప్పుడు వారానికి రెండు రోజులు మాత్రమే నడుపుతున్నారని అన్నారు.
ఎమ్మెల్యేలు సైతం ప్రజాదర్బార్‌ను నిర్వహిస్తామని గతంలో ప్రకటించారని, ఇవన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయని తెలిపారు. అప్పుల కుప్ప అని చెప్పి హామీల అమలు నుంచి తప్పించుకుందామనుకుంటున్నారా? అంటూ మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కొత్త అప్పులతో పన్నుల భారాన్ని ప్రజలపై మోపరాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి వం ద రోజుల సమయమిస్తున్నామని, బడ్జెట్ సమయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
పొన్నం వర్సెస్ మహేశ్వర్‌రెడ్డి
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి మధ్య స్వల్ప సంవాదం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో సోనియాగాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందని ప్రకటించారని, బీజేపీ.. సుష్మాస్వరాజ్ మద్దతుతోనే తెలంగాణ ఏర్పాటైన విషయాన్ని విస్మరించరాదని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
సకలజనులంతా కొట్లాడి రాష్ర్టాన్ని సాధించుకొన్నారని, కానీ కేవలం సోనియా వల్లే సాధ్యమైందనడం అత్యంత బాధాకరమని అన్నారు. దీనిపై కల్పించుకొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధానమంత్రి మోదీ పలుమార్లు తెలంగాణను, రాష్ట్ర ప్రజలను దారుణంగా అవమానించారని, తల్లిని చంపి బిడ్డను బతికించారని, తలుపులు మూసి రాష్ర్టాన్ని విభజించారని మాట్లాడారని ఎదురుదాడికి దిగారు.