వరంగల్, జూలై 6 : పంట రుణాల మాఫీ సాధ్యం కాదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలి ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు.
అనంతరం హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ.. రైతు పంట రుణాల మాఫీపై బీజేపీ వైఖరిని తేటతెల్లం చేశారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెప్తున్నానని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ అనేది సాధ్యం కాదని తేల్చిచెప్పారు. గతంలో కాంగ్రెస్ రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించినా సాధ్యం కాలేదని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు సాధ్యం కాని హామీలు ఇస్తాయని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఈటల పేర్కొనడం గమనార్హం.