హైదరాబాద్, ఫిబ్రవరి 14 : దేశ రక్షణలో సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటాలను, త్యాగాలను బీజేపీ తన స్వార్థ రాజకీయాలకు వాడుకొంటున్నదని పశుసంవర్ధ్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాఫెల్ కుంభకోణంపై మాట్లాడితే బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ది అభివృద్ధి పాలనైతే మోదీది ఫ్యాషన్ షో పాలన అని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ఏ రాజకీయ పార్టీ సైన్యాన్ని రాజకీయాలకు వాడుకోలేదని, బీజేపీ మాత్రమే అలాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. రాఫెల్ కుంభకోణంపై స్పందిస్తే వాళ్ల బండారం బయట పడుతుందని కేంద్ర మంత్రులు ఆ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు.
మోదీ ఫ్యాషన్ షో ప్రధాని
సైనికుల వీరోచిత పోరాటాలను, త్యాగాలను దేశంలో ఏ ముఖ్యమంత్రి గుర్తించని రీతిలో సీఎం కేసీఆర్ కీర్తించారని మంత్రి తలసాని గుర్తుచేశారు. మతపరంగా రెచ్చగొట్టడం, ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే బతుకుగా బీజేపీ వ్యహరిస్తున్నదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ నేతలంతా ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతి పాలైందని ఆరోపించారు. మోదీ పాలనలో దేశానికి జరిగిన ఒక్క మేలైనా ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. రోజుకు నాలుగైదు డ్రెస్సులు మారుస్తూ మోదీ ఫ్యాషన్ షో ప్రధానిగా మారారని ఎద్దేవా చేశారు. విద్యుత్తు సంస్కరణల పేరుతో ప్రధాని మోదీ దేశసంపదను అదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణపై మోదీ కక్షగట్టారని, అందుకే నిధులు ఇవ్వటం లేదని ద్వజమెత్తారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని కూడా మోదీ రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు.
కిషన్‌రెడ్డి ఏం ఒరగబెట్టారు?
మూడేండ్లుగా కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి రాష్ర్టానికి ఏం ఒరగబెట్టారో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌కు వరదలొస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.850 కోట్లతో పేదలను ఆదుకొన్నదని, వరదల్లో బండి పోతే బండి ఫ్రీ..కారుపోతే కారు ఫ్రీ..అని ప్రగల్భాలు పలికిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడెక్కడున్నారని నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లపై కిషన్‌రెడ్డి మొదట్లో నోరుపారేసుకొని ఇప్పుడు వాటి ప్రారంభోత్సవాలకు సిగ్గులేకుండా హాజరవుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల నోళ్లకు తాళం వేయకపోతే టీఆర్ఎస్ సైన్యం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
పొత్తుల అవసరం టీఆర్ఎస్కు లేదు
టీఆర్ఎస్కు ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తుపెట్టుకోవాల్సిన పనిలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో రెండుసార్లు టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి గెలిచిందని, భవిష్యత్‌లోనూ అదే ఒరవడిని అనుసరించి అజేయ శక్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో అతీగతీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, ఆయన తెలంగాణ చరిత్ర తెలియని పిచ్చోడని విమర్శించారు.
వైభవంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహిస్తామని తలసాని తెలిపారు. రాష్ర్టాన్ని సాధించి బంగారుమయం చేస్తున్న కేసీఆర్ పుట్టినరోజు టీఆర్ఎస్ శ్రేణులకు పండుగ రోజని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో పార్టీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతాయని వెల్లడించారు. మంగళవారం తెలంగాణ భవన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, 16న ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, 17న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారథ్యంలో వెంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తామని వివరించారు.