Maheshwar Reddy | హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ బూటకపు హామీలుగా మారాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో చెప్పించిన హామీలు అన్నీ బూటకపు హామీలుగా మార్చారు. ఎన్నికల మేనిఫెస్టోను డమ్మీ పేపర్‌గా తయారు చేశారని విమర్శించారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. లోకల్ బాడీ ఎన్నికలు జరగకుంటే కేంద్ర నుంచి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉంది. గ్రామ పంచాయతీలో శానిటేషన్ కార్మికులకు ఇచ్చే వేతనాలు కూడా ఇవ్వడం లేదు. మంత్రులు గ్రామాల్లోకి వెళ్లి పరిశీలిస్తే పరిస్థితి అర్థం అవుతుంది. సర్పంచ్ లు లేరు… ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం పూర్తయ్యింది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారితే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ తీసుకుంటున్నారు. వారికి నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. కానీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు మాత్రం ఇవ్వడం లేదు. రూ. 1200 కోట్ల సర్పంచ్ల నిధులను కక్ష సాధింపులో భాగంగా ఆపేశారు. మధ్యాహ్న భోజన పథకం వడ్డించే వారికి 7 నెలలుగా బిల్లులు చెల్లించలేదు. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు నచ్చిన వాళ్లకే బిల్లులు ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏప్రిల్ నెల పింఛన్లు జూన్ 25న ఇచ్చారు.. మరి మే, జూన్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిధులు లేక పంచాయతీలు విలవిలలాడుతున్నాయి. హైదరాబాద్‌లో ఉంటూ ప్రజా పాలన అంటే ఎలా..? పల్లెల్లో పర్యటిస్తూ ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను పరిష్కరించాలి. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తుంది. గ్రామాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే… పంచాయతీ, లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. పల్లె ప్రగతికి రావల్సిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.