హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతల బృందం గవర్నర్ను కోరింది. ఈమేరకు సోమవారం రాజ్భవన్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. జీవో 27ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 9వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని పేర్కొన్నారు.
కోకాపేటలో భూముల ధర ఇటీవల ఎంత పలికిందో మనమంతా చూశామని, మార్కెట్ విలువకు తక్కువగా ఎస్ఆర్ రేట్లు విధించడం ద్వారా భూములు ప్రైవేట్ రియల్ ఎస్టేట్ నెట్వర్క్ చేతుల్లోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద కుంభకోణం అని ఆరోపించారు. హిల్ట్ పాలసీ, జీహెచ్ఎంసీ విస్తరణ, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ విస్తరణలోనూ అనేక కుట్రలు జరుగుతున్నాయని నేతలు ఆరోపించారు. హిల్ట్ పాలసీతో ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలు కూడా మూతపడే అవకాశం ఉన్నదని, ఈ విషయాలనే తాము గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.