కరీంనగర్, జనవరి 12 : పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ వ్యవహారశైలిపై కరీంనగర్ బీజేపీలో కాక మొదలైంది. ఆయన ఒంటెత్తు పోకడలకు పోతున్నారని, పదవుల కోసం వస్తున్నవారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని పలువురు సీనియర్ నాయకులు నిరసన వ్యక్తంచేశారు. కరీంనగర్‌లోని గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో బుధవారం బీజేపీ పాతతరం, పాతవర్గానికి చెందిన నాయకులు సమావేశమయ్యారు. దీనికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వంద మందికిపైగా నాయకులు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో పార్టీని బతికించడానికి, పార్టీ సిద్ధాంతం కోసం నక్సలైట్లతో పోరాడిన నాయకులున్నారని, ఆనాడు బండి సంజ య్ అడ్రస్ కూడా పార్టీలో లేదని, వారందర్నీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, సీనియర్ నాయకులకు ఏమాత్రం గౌరవం ఇవ్వటం లేదని సమావేశంలో అభిప్రాయపడినట్టు తెలిసింది. కొత్తవాళ్లతో దోస్తీ కడుతూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అడ్డదారుల్లో వెళ్తున్నారనే విమర్శ సమావేశంలో బాహాటంగా వ్యక్తమైనట్టు సమాచారం. ఆత్మగౌరవం అంటూ వేరే పార్టీ వాళ్లు వస్తే వారికి తివాచీ పరిచి పార్టీలోకి ఆహ్వానిస్తున్న నాయకత్వం.. సొంత పార్టీలో దశాబ్దాలుగా నిబద్ధతతో పనిచేసిన నాయకులను పట్టించుకోవటం లేదన్న ప్రశ్నను లేవనెత్తారు. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులకే ఆత్మాభిమానం ఉంటుందా? సొంత పార్టీలో పనిచేసిన వారికి ఆత్మాభిమానం లేదా? అని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
రాష్ట్రవ్యాప్త మీటింగ్‌కు నిర్ణయం
బండి సంజయ్ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాతతరం, పాత వర్గం నాయకుల ను ఒక్కతాటిపైకి తెచ్చి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని, ఆ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించి తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. సాధ్యమైనంత తొందరంగా అన్ని జిల్లాల్లోనూ ఈ తరహా సమావేశాలు నిర్వహించాలని పలువురు సూచించగా అందరూ అంగీకారం తెలిపినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అసలు నిజాలను కేంద్ర నాయకత్వానికి తెలిపేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అభిప్రాయపడ్డట్టు సమాచారం. కరీంనగర్ సమావేశం గురించి ఇతర జిల్లాల నాయకులు అడిగారని, ఆయా జిల్లాల్లోనూ సమావేశాలు పెట్టుకోవాలని నిర్ణయించుకొన్నారని ఒక సీనియర్ నాయకుడు తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్‌రావు, అర్జున్‌రావు, కన్నబోయిన ఓదెలు, లింగంపల్లి శంకర్, కన్నెం అంజయ్య, లింగారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, బండి సంజయ్ సొంత జిల్లా నుంచే ఆయనపై తిరుగుబాటు చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీకి ఎంతో మంది రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరించారని, వారెవ్వరికీ సొంత జిల్లా నుంచి నిరసన సెగ తగల్లేదని, బండి సంజయ్‌కు మాత్రం సొంత జిల్లాలో, అందులోనూ పార్టీ సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసిన వారి నుంచి నిరసన వ్యక్తం కావడం బండి వైఖరికి నిదర్శమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఈ అసంతృప్తి సెగలు చాలా జిల్లాల్లో ఉన్నాయని, ఆ ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని పలువురు సీనియర్ నాయకులు చెప్తున్నారు.