BJP | హైదరాబాద్, అక్టోబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో -నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థలనే కాకుండా చివరకు ఎన్నికల కమిషన్‌ను కూడా బీజేపీ తనకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేస్తున్నదా? ఐదు రాష్ర్టాలకు ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ను సునిశీతంగా పరిశీలించినవారు ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, మిజోరంలో ఇతర రాష్ర్టాల కంటే ముందుగా (నవంబర్ 7న) పోలింగ్ నిర్వహించడం, ఆ తర్వాత కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ (నవంబర్ 12, 20), రాజస్థాన్ (నవంబర్ 23న)లో పోలింగ్ నిర్వహించడం, బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ పాలిత తెలంగాణలో అన్నింటికంటే చివరన నవంబర్ 30న పోలింగ్ నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణతోపాటు నాడు బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉన్న రాజస్థాన్‌లో ఇతర రాష్ర్టాల కంటే ముందుగా పోలింగ్ నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణలో పోలీంగ్ తేదీ అన్ని రాష్ర్టాల కంటే చివరలో ఉండటాన్ని పరిశీలకులు నిశితంగా గమనిస్తున్నారు. ఈ తరహా షెడ్యూల్ వల్ల బీజేపీ అగ్రనేతలు, సంఘ్పరివారం ముందుగా తమ రాష్ర్టాల్లో పోలింగ్‌ను ముగించుకుని ఆ తరువాత తాము బలహీనంగా ఉన్న రాష్ర్టాల్లో మిడతల దండు మాదిరిగా దండయాత్ర చేయడానికి అవకాశం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌తోపాటు బీఆర్ఎస్ పాలిత తెలంగాణలో ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు ఎక్కువ సమయం కేటాయించేందుకు, ఆయా రాష్ర్టాలకు సంఘ్ పరివారాన్ని తరలించేందుకు వీలు కలుగుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
17