హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేసేందుకే ప్రధాని మోదీకి సీఎం లేఖ రాశారని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రధానికి సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖను తాము ఖండిస్తున్నట్టు చెప్పారు.
‘రుణమాఫీపై కాంగ్రెస్ చెప్పిందేమిటి?, చేసిందేమిటి? వాస్తవాలపై బహిరంగ చర్చకు రావాలి’ అని సవాల్ విసిరారు. లేఖలోని అంశాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, తేదీ, వేదిక ఖరారు చేయాలని రేవంత్‌రెడ్డికి సవాల్ చేశారు. రుణమాఫీ చేయలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో తమ విజయావకాశాలను దెబ్బ తీస్తాయని కాంగ్రెస్ అధిష్ఠానం గ్రహించి ఆదేశిస్తేనే ప్రధానికి ఆగమేఘాల మీద రేవంత్‌రెడ్డి లేఖ రాశారని ఆరోపించారు.
కాంగ్రెస్‌వన్నీ పచ్చి మోసాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆ పార్టీ అంటేనే పచ్చిమోసమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అంకెల గారడీలతో ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తున్నదని, రుణమాఫీ అంశమే అందుకు నిదర్శనమని సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అసలు తెలంగాణలో పంటరుణాలు తీసుకున్న రైతులెందరు? రూ.2లక్షల్లోపు రుణాలున్నవారెందరు? మాఫీ అయిన వారెందరు? లెకలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పినదాంట్లో మూడోవంతు కూడా మాఫీ జరగలేదని తెలిపారు.